ప్రభాస్‌ సినిమా కోసం ఇంటర్నేషనల్‌ టెక్నాలజీ

20 Jan, 2021 07:57 IST|Sakshi

సినిమా మీద సినిమా కమిట్‌ అవుతూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు ప్రభాస్‌. ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. కమిట్‌ అయిన ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాల షూటింగ్స్‌ ఆరంభం కావాల్సి ఉంది. ‘ఆదిపురుష్‌’ పనులు ఆరంభమయ్యాయి. ఇందులో రాముని పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్‌. కీలక పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపిస్తారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలోని మోషన్‌ క్యాప్చర్‌ షూట్‌ మంగళవారం మొదలైంది. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్, కృష్ణకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ సుతార్, రాజేశ్‌ నాయర్‌ సహ నిర్మాతలు.

భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్‌’ సినిమా కోసం అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. ఈ చిత్రం కోసం తొలిసారి భారతదేశంలో ఇంటర్నేషనల్‌ టెక్నాలజీని వాడుతున్నాం. ప్రభాస్‌ సినిమాతో మేం ఈ టెక్నాలజీతో ముందుకు రావటం గర్వంగా ఉంది’’ అన్నారు. ప్రసాద్‌ సుతార్‌ మాట్లాడుతూ.. ‘‘ఫిలిం మేకర్స్‌కు వారి సినిమా కథ చెప్పటానికి విజువల్‌ మోషన్‌ క్యాప్చర్‌ ఉపయోగపడుతుంది. ‘ఆదిపురుష్‌’ కథ చెప్పటానికి మేం కూడా అదే టెక్నాలజీ వాడుతున్నాం. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ని ఫిబ్రవరి 2న ప్రారంభిస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు