‘సలార్‌’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌లో పాల్గొననున్న ప్రభాస్‌!

24 Sep, 2022 10:33 IST|Sakshi

ప్రముఖ దివంగత నటుడు కృష్ణంరాజు ఈ నెల 11న కన్నుమూసిన సంగతి తెలిసిందే. పెదనాన్న మరణించడంతో ప్రభాస్‌ తన తాజా చిత్రాల షూటింగ్‌ డేట్స్‌ని మళ్లీ ప్లాన్‌ చేయాల్సి వచ్చింది. పది రోజుల బ్రేక్‌ తర్వాత ‘సలార్‌’ సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు హీరో ప్రభాస్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో  ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు కీ రోల్‌ చేస్తున్నారు.

బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప్రభాస్‌. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల మొదటివారం వరకూ ప్రభాస్‌ ఈ సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉంటారని తెలిసింది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు ప్రభాస్‌. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా, అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘సలార్‌’ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబరు 28న రిలీజ్‌ కానుంది. ‘ప్రాజెక్ట్‌ కె’ 2024లో రిలీజ్‌ కానుందని తెలిసింది. అలాగే ప్రభాస్‌ నటించిన ‘ఆది పురుష్‌’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానుంది.    

కాగా, పెదనాన్న మరణంతో ప్రభాస్‌ పుట్టేడు శోకంలో ఉన్నప్పటికీ.. నిర్మాతల కోసం తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రాల షూటింగ్ పునఃప్రారంభానికి సహకరించడం.. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ద, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు. 

మరిన్ని వార్తలు