Project K: ‘ప్రాజెక్ట్‌ కే’ పై ప్రభాస్‌ షాకింగ్‌ నిర్ణయం!

2 Feb, 2023 11:04 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ టీజర్‌పై ట్రోల్స్‌, విమర్శలు రావడంతో విడుదలను వాయిదా వేశారు. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు కానీ.. దానికంటే ముందే సలార్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రభాస్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్‌ కే’ విషయంలో ప్రభాస్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారట. కథ పరిధి చాలా పెద్దగా ఉండడంతో ఒకే సినిమాలో అదంతా ఇమడ్చడం కష్టంగా ఉందని, రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నాడట. ఈ విషయం ప్రభాస్‌తో చర్చించగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై చిత్రం బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. పార్ట్‌ 1ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎవరు టచ్‌ చేయని పాయింట్‌తో.. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు