సామాన్యులకు లేని భద్రత.. సెలబ్రిటీకి ఎందుకు

12 Sep, 2020 16:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : వారం రోజులు.. రోజుకో ప్రకటన.. గంటకో సవాల్‌. పార్టీ ఎంపీ నుంచి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ఎదిరించే స్థాయికి చేరుకుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌. జాతీయ రాజకీయాల నుంచి సినీ పరిశ్రమ వరకు అన్ని వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారి రోజూ వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్‌ ఆత్మహత్యతో ప్రారంభమైన ఆమె విమర్శల ప్రకంపనలు, ఆ తరువాత చేసిన సవాళ్లు వారం రోజులుగా పతాక శీర్షికల్లోకి ఎక్కుతున్నాయి. కంగనా వైపు ఓ వర్గం పూర్తి మద్దతుగా నిలవగా.. మరోవైపు నుంచి విమర్శల బానాలు దూసుకొస్తున్నాయి. ఇక సినీ నటికి ఏకంగా వై కేటగిరి భద్రత కల్పించడంపై దేశ వ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. (కంగన వెనుక ఎవరున్నారు?)

ఈ క్రమంలోనే కంగనాపై బాహుభాషా నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు విమర్శలు ఎక్కుపెట్టాడు. తనకు ఎన్ని అడంకులు ఎదురైనా తలదించకుండా ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా ముందుకు వెళ్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది వీరుల పాత్రలు పోషించారని ఒక్క సినిమాతోనే (కంగనా) ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అయిపోయినట్లు అనుకోకని కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాకుండా కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడంపై కూడా ప్రకాశ్‌ రాజ్‌ గట్టిగా బదులిచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎర్రటి ఎండలో నడిరోడ్డుపై వలస కార్మికులు పొట్టచేతపట్టుకుని నడుచుకుంటూ పోతుంటే వారికి లేని భద్రత.. ఓ నటికి ఎందుకని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. అవునూ ఇది కొత్త భారతం అంటూ కామెంట్‌ సైతం పెట్టాడు. (ఠాక్రే-పవార్‌ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!)

‘ఒక్క సినిమాతో కంగ‌నా ర‌నౌత్ త‌న‌ను తాను రాణి ల‌క్ష్మీబాయితో పోల్చుకుంటే.. మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌ చక్రవర్తిగా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన అమిర్ ఖాన్, మోదీగా న‌టించిన వివేక్‌ల పరిస్థితేంటని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించాడు. కాగా  కంగనకు బీజేపీ మ‌ద్దతు ఉంద‌న్న ప్రచారం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించినట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు