Prakash Raj Resigns: నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది

12 Oct, 2021 07:56 IST|Sakshi

Maa Elections 2021: ‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు.. అది నా తప్పు కాదు.. వారి తప్పూ కాదు’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. సోమవారం విలేకరులతో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ – ‘‘పరభాషా నటులు ‘మా’ సభ్యులుగా ఉండొచ్చు కానీ పోటీ చేయడానికి అనర్హులుగా బైలాస్‌లో మార్పులు తీసుకొస్తామని ఇటీవల ‘మా’ ఎన్నికలకు ముందు తెలిపారు.

ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని  తీర్పు ఇచ్చారు.. ‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.  ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావుగార్లు, రవిబాబు వంటివారు మాట్లాడారు.. అందుకే అతిథిగానే ఉంటా.

‘మా’ సభ్యుడు కాకున్నా నన్ను పిలిచి తన సినిమాలో చేయమని మంచు విష్ణు అడిగినా నటిస్తాను. తెలుగు ఇండస్ట్రీవారితో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుంది.  ‘మా’ ఎన్నికల తర్వాత కొందరు ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అని మాట్లాడే అబద్ధాలను నేను నమ్మను’’ అన్నారు.

అంతేకాకుండా సోమవారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారాయన. ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం  ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’ అని ట్వీట్‌ చేశారు.

చదవండి: నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు: మోహన్‌ బాబు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు