పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్‌ ప్రణీత

15 Jun, 2021 17:05 IST|Sakshi

హీరోయిన్‌ ప్రణీత సుభాస్‌ ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు, బెంగళూరు వ్యాపారవేత్త నితిన్‌ రాజును మే 31న ఆమె రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె సడెన్‌గా పెళ్లి పీటలు ఎక్కడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ప్రణీత ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల నిరాడంబరంగా తన పెళ్లి తంతును జరపాల్సి వచ్చిందన్నారు.

‘పరిశ్రమకు చెందిన సన్నిహితులు, అందరి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మా పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నాం. కానీ ఈ సారి జులైలోనే ఆషాడం ఉంది. ఆషాడ మాసం దగ్గర్లోనే ఉండేసరికి సింపుల్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా కుటుంబం అన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. అందుకే ఆషాడ మాసం, దాని తర్వాత వచ్చే పరిణామాలపై అపనమ్మకంతో ఇరు కటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పెళ్లి వేడుకను నిర్వహించాం. అంతేగాక సెకండ్‌ వేవ్‌ ఉధృతికి ఎంతోమంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చూస్తున్న క్రమంలో మేము ఆడంబరంగా వివాహం చేసుకోవడం సరైనది కాదనే భావన కూడా ఒక కారణం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రణీత హిందీలో నటించి ‘భుజ్‌’ చిత్రం ఓటీటీలో విడుదల కాగా ‘హంగామా-2’ మూవీ విడుదల కావాల్సి ఉంది. 

చదవండి: 
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు