Prem Rakshith: నేను కొరియోగ్రాఫర్‌ను అని స్వయంగా చెప్పినా రాజమౌళి నమ్మలేదు

20 Mar, 2023 09:56 IST|Sakshi

నాటు నాటు పాట చిలక్కొట్టుడుగా కాదు చితక్కొట్టే రేంజ్‌లో ఉంది. అందుకే ఆ మాస్‌ పాటకు క్లాస్‌ ఆడియన్స్‌ కూడా ఫిదా అయ్యారు. ఏకంగా ఆస్కార్‌ కూడా హాలీవుడ్‌ పాటలను వెనక్కు నెట్టి తెలుగు పాట ఒడిలో చేరింది. ఈ సాంగ్‌కు అకాడమీ అవార్డు రావడానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌, హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కారణమని అందరికీ తెలిసిందే! అయితే ఈ పాట ఇంత అందంగా ఉండటానికి, అందరికీ దగ్గరవ్వడానికి కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ముఖ్య కారణమని కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఇటీవలే నొక్కి మరీ చెప్పాడు. కానీ ప్రేమ్‌ ఓ కొరియోగ్రాఫర్‌ అన్న విషయాన్ని రాజమౌళి మొదట్లో నమ్మలేదట! ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం..

మొదట్లో ప్రేమ్‌ టైలర్‌ షాపులో పని చేశాడు. ఆ తర్వాత కొరియోగ్రఫీ ట్రై చేశాడు. చిన్నాచితకా సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూ రాజమౌళి ఇంట్లో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించేవాడు. కానీ తనొక డ్యాన్స్‌ మాస్టర్‌ అన్న విషయాన్ని చాలాకాలం వరకు రాజమౌళికి చెప్పలేదట ప్రేమ్‌. ఈ విషయం గురించి తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'నేను రాజమౌళి ఇంటికి వెళ్లి పిల్లలకు క్లాస్‌ తీసుకునేవాడిని. వాళ్లిచ్చిన డబ్బులతో అటు అమ్మానాన్నలకు, ఇటు నాకు పూట గడిచేది. అక్కడ వాళ్లు అద్దె కట్టుకుంటే, ఇక్కడ నేను కూడా నా ఇంటి అద్దె కట్టుకునేవాడిని. నా తమ్ముడిని చదివించేవాడిని. అయితే నేను కొరియోగ్రాఫర్‌ అని రాజమౌళికి తెలియదు. ఆ విషయం చెప్తే ఎక్కడ నన్ను పనిలోంచి తీసేస్తాడో, అఫీషియల్‌గా కేవలం ఆఫీసులోనే కలుస్తారోనని ఎన్నడూ ఓపెన్‌ అవ్వలేదు.

రాజమౌళి సతీమణి రమా మేడమ్‌.. దోశలు వేసి ఆప్యాయంగా అడిగి మరీ వేసేది. వాళ్లింటికి వెళ్తే నాకు కడుపు నిండా భోజనం దొరికేది.  ఒకరోజు రాజమౌళి ఇంట్లో విద్యార్థి సినిమాలోని పాట ప్లే అవుతూ ఉంది. ఎవరో బాగా చేశారు అని ఆయన అన్నారు. అది విన్నాక నా మనసు ఆగలేదు. నేనే సర్‌ కొరియోగ్రఫీ చేశానని చెప్పాను. ఆయన నేనేదో జోక్‌ చేస్తున్నాడుకున్నాడో ఏమో కానీ నువ్వు చేశావా? వెళ్లెళ్లు అంటూ అపనమ్మకంగా మాట్లాడారు. నిజంగా నేనే చేశాను సర్‌ అని నమ్మించేందుకు ప్రయత్నించడంతో ఆయన ఫోన్‌ చేసి కనుక్కున్నారు. అప్పుడు ఆయనకు నిజం తెలిసింది. ఎందుకు మాస్టర్‌, ఇన్నాళ్లూ చెప్పలేదని ప్రశ్నించారు. మీకు నిజం తెలిస్తే నా పని పోతుంది, కుటుంబ పోషణ కష్టమవుతుంది సర్‌ అని వివరించాను. ఆ తర్వాత రాజమౌళి సర్‌ చేసిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ.. ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు పలు సినిమాలకు పని చేశాను అని చెప్పుకొచ్చాడు ప్రేమ్‌ రక్షిత్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు