ప్రణయ జీవుల సినీవాసం ‘ప్రేమనగర్‌’

24 Sep, 2021 13:29 IST|Sakshi

కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్‌ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్‌ రూపం – ‘ప్రేమనగర్‌’. 

ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్‌ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్‌ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్‌’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్‌’ (1971 సెప్టెంబర్‌ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. 


ఒకరు కొంటే, వేరొకరు తీశారు!
‘ప్రేమనగర్‌’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్‌గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. కె.ఆర్‌. విజయ హీరోయిన్‌. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్‌రెడ్డికి సెంటిమెంట్‌ పట్టుకుంది. ప్రాజెక్ట్‌ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని,  హిట్‌ హీరోయిన్‌ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్‌’ ప్రారంభించారు. 


ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్‌ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్‌ స్క్రిప్ట్‌ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్‌ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్‌లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్‌’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్‌ ఇల్లు, ప్రేమనగర ఫుల్‌ఫ్లోర్‌ సెట్‌ సంచలనం.


అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్‌మార్క్‌

ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్‌ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’,  ఆ వెంటనే ‘ప్రేమనగర్‌’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్‌ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌. 

ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్‌మార్క్‌. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్‌ ఐకాన్‌ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్‌ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. 


రిపీట్‌ రన్ల... బాక్సాఫీస్‌ నగర్‌!

‘ప్రేమనగర్‌’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్‌ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్‌’ బంపర్‌ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్‌లో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. 

అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్‌’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్‌తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్‌ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్‌’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్‌ రన్ల పరంగా నంబర్‌ 1 చిత్రమైంది. హార్ట్‌ ఆపరేషన్‌ తర్వాత అక్కినేని రెస్ట్‌ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్‌’ రిపీట్‌లో 50 రోజులు ఆడడం విశేషం.


మూడు భాషలు... ముగ్గురు స్టార్లు...

‘ప్రేమనగర్‌’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్‌ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్‌నగర్‌’లో రాజేశ్‌ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్‌. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్‌ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్‌ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్‌ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మరో మెట్టెక్కించింది.

అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’గా 3 భాషల్లో హిట్‌. ఆ తరువాత ‘ప్రేమనగర్‌’ మూడు భాషల్లో హిట్‌. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్‌ కుమార్‌. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్‌ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్‌ 40 వారాలాడిన కెరీర్‌ బెస్ట్‌ హిట్‌. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్‌గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్‌లో 2013 మార్చి 8న రీరిలీజ్‌ చేస్తే, అప్పుడూ హిట్టే.


మారిన పాటలు! మారని క్లైమాక్స్‌! 

‘ప్రేమనగర్‌’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్‌ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్‌ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్‌తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్‌లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్‌ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్‌ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు.

లవ్‌స్టోరీలకు ఇది సెంటిమెంట్‌ డేట్‌! 
‘ప్రేమనగర్‌’ బాక్సాఫీస్‌ హిట్‌తో ఆ రిలీజ్‌ డేట్‌ సెంటిమెంట్‌ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్‌ 24నే రామానాయుడు రిలీజ్‌ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్‌ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్‌ ‘లవ్‌స్టోరీ’ ఇదే డేట్‌కి రిలీజ్‌ చేయడం విశేషం.  
– రెంటాల జయదేవ 

మరిన్ని వార్తలు