C Kalyan: ఎలక్షన్స్‌ కోసం టెంట్లు.. సి.కల్యాణ్ ఆగ్రహం

18 Jan, 2023 14:30 IST|Sakshi

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఎఫ్‌పీసీ (TFPC) కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని ఆరోపించారు. మా సభ్యుల్లో కె.సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్‌ను  జీవిత కాలం బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని ఆయన అన్నారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఎప్పుడు అలాగే ఉండాలనేదే మా కోరిక అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్‌లో కల్యాణ్ మాట్లాడారు. 

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కల్యాణ్‌ వెల్లడించారు. కొందరు నిర్మాతలు ఛాంబర్‌ దగ్గర టెంట్‌వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారని అన్నారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడం లేదంటూ కామెంట్లు చేశారు.  ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవచ్చన్నారు.

సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'టీఎఫ్‌పీసీ కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోం. ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. మా కౌన్సిల్‌లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం దాసరి నారాయణ రావు గారే. మా సభ్యులలో కె సురేశ్ కుమార్ మూడేళ్లు మాత్రమే సస్పెండ్‌ చేశాం. యలమంచిలి రవి కుమార్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నాం. ఇకమీద తెలుగు చలనచిత్ర మండలికి ఆయనకి శాశ్వతంగా ఎలాంటి సంబంధం ఉండదు.  40 ఏళ్ల ఈ సంస్థలో ఇలా ఎవరూ చేయలేదు.  ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవచ్చు.' అని అన్నారు.

ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్: కల్యాణ్

వచ్చేనెలలో తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఉంటాయని సి.కల్యాణ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు.  ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 19న ఓటింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌తో పాటు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు.  ఎలక్షన్స్ కోసం ఒక పది మంది సభ్యులు టెంట్‌లు వేశారని కల్యాణ్ ఆరోపించారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్లీ పోటీ చేయనని ఆయన తెలిపారు.

  • ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు.
  • ఫిబ్రవరి 1 నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్‌
  •  ఒకరు ఒక్క పోస్ట్‌కు మాత్రమే పోటీ చేయాలి
  • 13వ తేదీ వరకు నామినేషన్ విత్‌ డ్రా చేసుకునే అవకాశం
  • ఎన్నికల అధికారిగా కె.దుర్గ ప్రసాద్‌
  • అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్‌

ప్రభుత్వాలను కోరతాం: కల్యాణ్

సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరును గురించి ప్రస్తావించారు సి కల్యాణ్.  ఆంధ్రాకి సినిమా పరిశ్రమ వెళ్తుందని నేను అనుకోవట్లేదన్నారు.  కొందరు పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారని సి.కల్యాణ్ అన్నారు. అవి ఏవి కూడా టీఎఫ్‌పీసీలో భాగం కాదన్నారు.  నంది అవార్డులు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు.  ఆంధ్రలో నంది అవార్డులు,  తెలంగాణలో సింహా అవార్డులు త్వరగా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో మా ఫిలిం ఇండస్ట్రీ తరుపున అవార్డులను మేమే ఇస్తామని కల్యాణ్ స్పష్టం చేశారు. 

కౌన్సిల్‌ ఫండ్‌ వివరాలు వెల్లడించిన కల్యాణ్
ఇక కౌన్సిల్‌ ఫండ్‌ గురించి మాట్లాడుతూ.. ' మా కౌన్సిల్‌ లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్‌ ఉంది.  ఇంత అమౌంట్‌ రావడానికి దాసరి నారాయణ రావు గారే.  మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్‌ ఉంది.  మూవీ టవర్స్‌లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్‌ 31వ తేదీ వరకు అకౌంట్స్‌ అన్ని ఈసీలో పాస్‌ అయినవే అని అన్నారు.

వాటితో ఎలాంటి సంబంధం లేదు

అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్ ..  దానికి అనుబంధంగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఉన్నాయని తెలిపారు. అంతే కానీ  ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థలకు మాకు ఎలాంటి సంబంధం లేదు.  పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవి కూడా మా సంస్థలో భాగం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు