మా ఆడపడుచే మార్గదర్శి

20 Aug, 2020 02:09 IST|Sakshi
హాస్పిటల్‌కి వెళ్లతు...

సంజయ్‌ చికిత్సలో మాన్యతకు ప్రియాదత్‌ తోడు

‘‘సంజయ్‌ దత్‌ చికిత్సలో మా ఆడపడుచు ప్రియాదత్తే మాకు తోడూ నీడగా ఉంది. ఆమే మాకు మార్గదర్శి. మా కుటుంబం నడిపే కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవహారాలను ఆమె రెండు దశాబ్దాలుగా చూస్తోంది. సంజయ్‌ తల్లి (నర్గిస్‌) పడ్డ కేన్సర్‌ వేదనను, కేన్సర్‌కు సంబంధించిన చికిత్స విధానాలను ఆమె పూర్తిగా తెలుసుకొని ఉంది. అందుకే సంజయ్‌ చికిత్సలో ఆమె ముందు ఉండి మాకు ధైర్యం చెబుతోంది’’ అన్నారు సంజయ్‌ దత్‌ భార్య మాన్యతా దత్‌.

సంజయ్‌ దత్‌కు కేన్సర్‌ వచ్చిన విషయాన్ని కుటుంబం ఇప్పటిదాకా అధికారికంగా వెల్లడి చేయకపోయినా ఇప్పుడది బహిరంగ రహస్యం అని చెప్పవచ్చు. ఆగస్టు రెండో వారం నుంచి ఆయన కేన్సర్‌ వార్తలు బయటకు వచ్చినా ‘మీరు ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు’ అని మాత్రమే కుటుంబం అంటోంది.

ఇప్పుడు తాజాగా సంజయ్‌ చికిత్స గురించి మాన్యత మరికొన్ని వివరాలు చెప్పింది.
‘‘సంజయ్‌ దత్‌కు ప్రాథమిక చికిత్స ముంబై కోకిలాబెన్‌లోనే జరిపించాలని నిశ్చయించుకున్నాం. ఆయన ప్రాథమిక చికిత్స కోకిలాబెన్‌లో మొదలయ్యింది. అది పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటాం. ఆ తర్వాత అమెరికా వెళ్లడం గురించి కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. కోకిలాబెన్‌లో బెస్ట్‌ డాక్టర్లు సంజయ్‌కు చికిత్స చేస్తున్నారు. మేము ధైర్యంగా ఉన్నాం’’ అని ఆమె పేర్కొంది.

ఈ సమయంలో సంజయ్‌ దత్‌ సోదరి ప్రియా దత్‌ వెన్నంటి ఉండటం ఆమెకు ధైర్యాన్ని ఇస్తోంది. కోకిలాబెన్‌ ఆస్పత్రికి సంజయ్‌ దత్‌తో ప్రియా దత్‌ తోడుగా వస్తోంది.

‘‘కరోనా పరిస్థితుల వల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి వ్యవహారాలను చూసుకుంటున్నాను. హాస్పిటల్‌ పనులన్నీ ప్రియా చూసుకుంటోంది. సంజయ్‌ దత్‌ నా పిల్లలకు మాత్రమే తండ్రి కాదు. తండ్రి (సునీల్‌ దత్‌) మరణం తర్వాత సంజయ్‌ దత్‌ ఇద్దరు చెల్లెళ్లు ప్రియ, నమ్రతలకు కూడా ఆయన తండ్రి సమానుడు అయ్యాడు. ఆయన అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే మేమందరం కదిలిపోయాం. కానీ వెంటనే దీనిని సమూలంగా ఎదుర్కొనాలని నిశ్చయించుకున్నాం’’ అని మాన్యతా చెప్పింది.

ప్రతి కుటుంబంలో ఆడపడుచు పాత్ర కీలకం. సవాలు సమయాల్లో ఆడపడుచు సలహాలు సూచనలు ముఖ్యమవడాన్ని చూస్తుంటాం. ఇక్కడ ప్రియా దత్‌ కూడా ఒక ఆడపడుచుగా మాన్యతకు కొండంత అండగా నిలవడం భారతీయ కుటుంబ నిర్మాణపు ఒక విశిష్ట ప్రతిఫలనం అని చెప్పవచ్చు.
 

మరిన్ని వార్తలు