Priyadarshi: మొదటిసారి బాగా చేశావురా.. అని నాన్న అభినందించారు

15 Mar, 2023 08:43 IST|Sakshi

‘‘నా కెరీర్‌లో ‘బలగం’ ఓ మైలురాయి. నేను నటించిన సినిమాలు చూసిన మా నాన్నగారు(సుబ్బాచారి) ఎప్పుడూ నన్ను అభినందించలేదు. కానీ, ‘బలగం’ చూసి నా భుజంపై చేయి వేసి, ‘చాలా బాగా చేశావురా’ అన్నారు.. అదే నాకు పెద్ద ప్రశంస’’ అని నటుడు ప్రియదర్శి అన్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బలగం’.

‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలైంది. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘బలగం’కి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. ‘చిన్న మనస్పర్థల వల్ల మా అన్న, నేను రెండేళ్లుగా మాట్లాడుకోలేదు.. ‘బలగం’ చూశాక మా అన్నకి నేనే ఫోన్‌ చేశాను.. ఇద్దరం మాట్లాడుకున్నాం’ అని ఒకతను ఫోన్‌ చేసి చెప్పడంతో ఎంతో ఆనందం వేసింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో హీరోగా, వేరే హీరోల చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు