వ్యాక్సిన్ వద్దు.. మీ సినిమా చాలన్నారు

14 Mar, 2021 06:36 IST|Sakshi

‘‘కమెడియన్, హీరో, విలన్  అని కాదు... ఓ మంచి నటుడిగా నన్ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా కామెడీ చేయడం అంత సులువేం కాదు’’ అన్నారు ప్రియదర్శి. నవీన్  పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో అనుదీప్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన శేఖర్‌ పాత్రకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సినిమాను, నా పాత్రను అభినందిస్తూ చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. ఒకరైతే వ్యాక్సిన్  వద్దు. మీ సినిమా చాలు అన్నారు. సరదాగా అనిపించింది.

మొదట రాహుల్‌ రామకృష్ణకు కథ నచ్చి నన్ను కూడా వినమన్నాడు. అనుదీప్‌ ఈ కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. రెండేళ్ళుగా నవీన్  నాకు తెలుసు. పదేళ్లుగా రాహుల్‌ తెలుసు. మా స్నేహం స్క్రీన్ పై ప్రతిబింబించిందని అనుకుంటున్నా. నాగ్‌ అశ్విన్ , స్వప్న అక్క బాగా సహాయం చేశారు. ‘మొదట్లో ఇండస్ట్రీలో ప్లేస్‌ కోసం ప్రయత్నించాను. ‘టెర్రర్‌’లో విలన్ గా చేశా. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’తో కమెడియన్ గా మారాను. నాకు ఎస్వీఆర్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌గార్ల యాక్టింగ్‌ అంటే ఇష్టం. నా భార్య రైటర్‌. తనతో నా సినిమాలు కొన్ని డిస్కస్స్‌ చేస్తుంటా. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. డైరెక్షన్  ఆలోచన ఉంది. కానీ డైరెక్షన్  చాలా టఫ్‌. భవిష్యత్తులో చూడాలి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు