ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను

13 Feb, 2022 03:26 IST|Sakshi

‘‘సినిమాల్లో మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాంగ్స్, డ్యాన్స్, రొమాన్స్‌ మాత్రమే కాదు.. కథ పరంగా సినిమాల్లోని మహిళల పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది చాలా మంచి విషయం’’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘‘భామాకలాపం’కు మంచి స్పందన లభిస్తోంది’’ అని ప్రియమణి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియమణి చెప్పిన విశేషాలు.

► ‘భామా కలాపం’ కథను దర్శకుడు అభిమన్యు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. నాకెలా చెప్పారో అలానే తీశారు. స్ట్రయిట్‌ ఫార్వార్డ్, బోల్డ్, ఫైర్‌ బ్రాండ్‌... ఇలాంటి క్యారెక్టర్స్‌ చేశాను కానీ అనుపమలాంటి పాత్రను ఇప్పటివరకూ చేయలేదు. రియల్‌ లైఫ్‌లో నేను అనుపమ అంత అమాయకంగా ఉండనని నా బాడీ లాంగ్వేజ్‌ చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది మధ్యతరగతి గృహిణులను స్ఫూర్తిగా తీసుకుని నేనీ పాత్ర చేశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులు మెచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

► సినిమాలో అనుపమ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కానీ రియల్‌ లైఫ్‌లో నేనంతగా జోక్యం చేసుకోను. నాలుగేళ్లుగా నా పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా నాకు తెలియదు.. ఈ మధ్యే  తెలిసింది. వ్యక్తిగతంగా కూడా తోటివారి జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోను.

► నా భర్త (ముస్తఫా) ‘భామాకలాపం’ చూసి, అభినందించారు. ‘అనుపమ పాత్ర బాగా చేశావ్‌. చీరలో అందంగా కనిపిస్తున్నావు. కామెడీ పాత్రలకు బాగా సూట్‌ అవుతావనిపిస్తోంది. ఇలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేయి’ అన్నారు. ఇంకా కొత్త కొత్త పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌ రోల్‌ చేయాలని ఉంది.

► తెలుగులో ‘విరాటపర్వం’, హిందీలో అజయ్‌ దేవగన్‌ ‘మైదాన్‌’, కన్నడలో డాక్టరు 56, తమిళంలో ‘కొటేషన్‌ గ్యాంగ్‌’, ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ వెబ్‌ సిరీస్‌.. ఇలా నావి చాలా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి.

‘భామా కలాపం’లో అనుపమ వంట బాగా చేస్తుంది. నిజజీవితంలో వంటలో నా ప్రావీణ్యత జీరో. తింటాను.. కానీ వంట చేయలేను. నా భర్త వండుతారు. నేను తింటాను. ఆయన నాకు ఇది చేసిపెట్టు అని అడగలేదు. నాకూ చేయాలనిపించలేదు. సో.. నేను వెరీ వెరీ లక్కీ. నాకోసం ప్రేమతో ఆయన చేసిన హోమ్‌ ఫుడ్‌ అంటే నాకు చాలా ఇష్టం.

మరిన్ని వార్తలు