Priyanka Chopra: ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో తప్పులో కాలేసిన ప్రియాంక.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

29 Mar, 2023 15:30 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటి నుంచి అవార్డు అందుకునేవరకు చిత్రయూనిట్‌కు సపోర్ట్‌గా నిలబడింది గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ వచ్చినప్పుడు ఇండియన్‌ సినిమా మరో మెట్టు ఎక్కిందని సంబరపడిపోయింది. రామ్‌చరణ్‌, ఉపాసనలకు లాస్‌ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో పార్టీ కూడా ఇచ్చింది. ఇంత చేసిన ప్రియాంక తాజా ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్‌ను తమిళ మూవీగా పేర్కొంటూ ట్రోలింగ్‌ బారిన పడింది.

తాజాగా ప్రియాంక చోప్రా ఓ పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇక్కడ బాలీవుడ్‌ సినిమాల గురించి ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడగ్గా వాటికి తీరికగా సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమ కొందరి చేతుల్లోనే ఏకీకృతమైందన్న విషయం వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలావరకు మారాయి అని చెప్పుకొచ్చింది. ఇంతలో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రస్తావించడంతో మధ్యలో కలగజేసుకున్న ప్రియాంక.. అది బాలీవుడ్‌ చిత్రం కాదని, ఒక తమిళ సినిమా అని అభివర్ణించింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక గ్రేట్‌, బ్లాక్‌బస్టర్‌ తమిళ మూవీ.. అది మనందరికీ అవెంజర్స్‌ మూవీవంటిది' అని పేర్కొంది. ఇది విన్న జనాలు.. 'మొన్నటిదాకా ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ మూవీ అన్నారు, ఇప్పుడేమో తమిళ చిత్రం అంటున్నారు... తెలుగు చిత్రమని ఇంకెప్పుడు గుర్తిస్తారు?', 'ఏంటి ప్రియాంక.. ఆఖరికి నువ్వు కూడానా? ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలిగా', 'మీరు మా మనోభావాలు దెబ్బ తీశారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు