చర్మం రంగు ముఖ్యం కాదని ఇప్పుడు తెలుసుకున్నా

27 Jan, 2021 04:59 IST|Sakshi

‘‘నల్లగా ఉంటే అందంగా కనిపించం అనే అభిప్రాయం చిన్నప్పుడే నాలో బలంగా నాటుకుపోయింది. తెల్లగా కనపడాలనే తాపత్రయంతో నా ముఖానికి పౌడర్లు, క్రీములు రాసుకునేదాన్ని. కానీ చర్మం రంగు ముఖ్యం కాదని ఇప్పుడు తెలుసుకున్నాను’’ అన్నారు ప్రియాంకా చోప్రా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పదేళ్ల క్రితం తాను ‘ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌’ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించడం గురించి మాట్లాడారామె. ఈ విషయం గురించి ప్రియాంక చెబుతూ– ‘‘ఆ క్రీమ్‌ని ప్రచారం చేసినందుకు అప్పట్లో నన్ను చాలామంది విమర్శించారు. రంగుని, జాత్యాహంకారాన్ని ప్రమోట్‌ చేస్తున్నట్లే అని అన్నారు.

ఆ ఉత్పత్తిని ప్రమోట్‌ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. తెల్లగా కనబడాలనుకోవడం ఇక్కడ చాలా కామన్‌ విషయం. ఇంత పెద్ద ఇండస్ట్రీ (సినిమా)లో నటీమణుల రంగు గురించి ఆలోచించడం సహజం. అయితే ఫెయిర్‌నెస్‌ క్రీములను ప్రమోట్‌ చేయడం సరికాదని అనిపించిన క్షణం నుంచీ మానేశాను. నా కజిన్స్‌ తెల్లగా ఉంటారు. మా నాన్నగారు నల్లగా ఉంటారు. అదే రంగు నాకు వచ్చింది. మా ఫ్యామిలీవాళ్లు నన్ను ‘కాలీ... కాలీ.. కాలీ.. ’ అని సరదాగా పిలిచేవారు. నా పదమూడేళ్ల వయసులో ఏదైనా ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడి, నా రంగుని మార్చుకోవాలనుకున్నాను (నవ్వుతూ)’’ అన్నారు. ఇంతకీ కాలీ.. కాలీ... అంటే ఏంటీ? అంటే నలుపు రంగు అని అర్థం. 

>
మరిన్ని వార్తలు