world book day: వీళ్లు నటించగలరు.. పుస్తకాలూ రాయగలరు

23 Apr, 2021 09:06 IST|Sakshi

నేడు వరల్డ్‌ బుక్‌ డే

ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్‌ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం

క్రాకింగ్‌ ది కోడ్‌ మై జర్నీ ఇన్‌ బాలీవుడ్‌ –ఆయుష్మాన్‌ ఖురానా
ఆయుష్మాన్‌ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్‌–టు–బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్‌ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్‌ ది కోడ్‌. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్‌ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్‌ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్‌ హుమ్, టికెట్‌ టు బాలీవుడ్‌...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం.
పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు.

ది పెరిల్స్‌ ఆఫ్‌ బీయింగ్‌మోడరేట్లీ ఫేమస్‌ సోహా అలీ ఖాన్‌
పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్‌ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్‌ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్‌ మీడియా కల్చర్‌పై తనదైన శైలిలో రాశారు.
పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. 

అమ్మ మియా: ఇషా డియోల్‌
మాతృత్వం మధురిమపై ఇషా డియోల్‌ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్‌ పేరెంటింగ్‌ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్‌కు ఇదొక మంచి గైడ్‌లా ఉపకరిస్తుంది.
పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే!

అన్‌ఫినిష్డ్‌  ప్రియాంక చోప్రా
సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్‌ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్‌ఫిన్‌ఫినిష్డ్‌’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్‌ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి.
పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే!

మరిన్ని వార్తలు