భారతదేశానికి హాలీవుడ్‌ సాయం

5 May, 2021 02:56 IST|Sakshi
ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనాస్‌

‘‘కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా భారతదేశంలో హృదయవిదారక దృశ్యాలు కనిస్తున్నాయి. ఈ భయంకరమైన కరోనా వైరస్‌ మనల్ని కూడా ఇబ్బంది పెట్టి చాలా రోజులేం గడవలేదు. భారతదేశంలో ఉన్న మన అన్నదమ్ముల కోసం మీకు చేతనైనంత సాయం చేయండి. చేయూత చిన్నదైనా దాని ఫలితం మంచి చేస్తుంది’’ అని అమెరికన్‌ నటి మిండీ క్యాలింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే భారత దేశంలోని కోవిడ్‌ బాధితులకు సహాయం చేయాల్సిందిగా పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు కోరుతున్నారు.


జయ్‌ శెట్టి, రాధిక 

అంతర్జాతీయ రచయిత, పాడ్‌ క్యాస్టర్‌ జయ్‌ శెట్టి, అతని భార్య రాధికతో కలిసి ‘హెల్ప్‌ ఇండియా బ్రీత్‌’ అనే ఫండ్‌ రైజర్‌ను మొదలు పెట్టారు. ఒక  మిలియన్‌ డాలర్ల (దాదాపు 7 కోట్లు) కనీస విరాళాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ నిధి విరాళ సేకరణను ప్రారంభించారు జయ్‌ శెట్టి దంపతులు. ఇందులో భాగంగా ప్రముఖ హాలీవుడ్‌ యాక్టర్‌ స్మిత్‌ ఫ్యామిలీ, కెనడియన్‌ సింగర్‌–సాంగ్‌ రైటర్‌ షాన్‌ మెండెస్, అమెరికన్‌ వ్యాపారవేత్త రోహన్‌ ఓజా, రచయిత బ్రెండెన్‌ బుచార్డ్‌లు తలా 50 వేల డాలర్ల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఐటీ కాస్మోటిక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జామీ కెర్న్‌ లిమా లక్ష డాలర్లను ప్రకటించారు. ఇక బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనాస్‌ కలిసి కోవిడ్‌ బాధితుల కోసం ‘టుగెదర్‌ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు హాలీవుడ్‌ తారలు ఇండియాకి సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు