Haseena Movie Review: హసీనా సినిమా రివ్యూ

19 May, 2023 18:15 IST|Sakshi
Rating:  

టైటిల్‌: హసీనా
నటీనటులు: థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట
దర్శకుడు: నవీన్‌ ఇరగాని
నిర్మాత: తన్వీర్‌ ఎండీ
ఎడిటర్‌: హరీశ్‌ కృష్ణ(చంటి)
కెమెరామన్‌: రామ కందా
సంగీత దర్శకుడు: షారుక్‌ షేక్‌
నేపథ్య సంగీతం: నవనీత్‌ చారి

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హసీనా. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్‌ సెలబ్రిటీలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ చిత్రం మే 19న రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..

కథ
హసీనా (ప్రియాంక డే), థన్వీర్‌(థన్వీర్‌), సాయి (సాయితేజ గంజి), శివ (శివ గంగా), ఆకాశ్‌(ఆకాశ్‌ లాల్‌) అనాథలు. అందరూ చిన్నప్పటి నుంచి కలిసి కష్టపడి చదువు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే హసీనా పుట్టినరోజున ఓ చేదు అనుభవం ఏర్పడుతుంది. ఆ చేదు ఘటనతో మిగతా నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. వీరి కథలోకి అభి(అభినవ్‌) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అభి ఏం చేశాడు? హసీనాకు జరిగిన చేదు ఘటన ఏంటి? నలుగురు స్నేహితులు, హసీనాల ప్లాన్‌ ఏంటి? కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ
అనాథలైన నలుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, చదవటం, ఉద్యోగం చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్‌ లాక్కొచ్చాడు డైరెక్టర్‌. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్‌ పెట్టాడు. ఐదుగురు అనాథలు ఓ కేసులో చిక్కుకుంటారు. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది సెకండాఫ్‌లో చూపించారు. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు ముందుగానే తెలిసిపోతాయి. క్లైమాక్స్‌ వరకు ఏదో ఒక ట్విస్ట్‌ వస్తూనే ఉండటంతో ఇన్ని ట్విస్టులా అని ఆశ్చర్యం వేయక మానదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

నటీనటులు
కొత్తవారే అయినా బాగానే నటించారు. కామెడీ సీన్స్‌లో నవ్విస్తూ, యాక్షన్‌ సీన్స్‌లో ఫైట్స్‌ చేస్తూ, ఎమోషనల్‌ సీన్లలో కంటతడి పెట్టిస్తూ అందరూ పర్వాలేదనిపించారు. హసీనా పాత్రలో ప్రియాంక డే చాలా వేరియషన్స్‌ చూపించింది. అభి పాత్రలో హీరోయిజం, విలనిజం చూపించాడు అభినవ్‌.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత ఇంట మోగనున్న పెళ్లిబాజాలు

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు