ఆ సమస్య వల్లే బరువు పెరిగాను!

11 Aug, 2021 00:01 IST|Sakshi

‘‘కోవిడ్‌ తర్వాత థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేసిన ఈ సమయంలో నేను హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ఒక వారం గ్యాప్‌లో విడుదలవుతున్నాయని చాలా ఆందోళనకు గురయ్యాను. ‘తిమ్మరుసు’ చిత్రాన్ని హిట్‌ అన్నారు. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’కి మొదట్లో కాస్త మిక్డ్స్‌ టాక్‌ వచ్చింది కానీ ఆ తర్వాత సూపర్‌ కలెక్షన్స్‌ వస్తున్నాయి. నా రెండు సినిమాలకు మంచి స్పందన రావడంతో హ్యాపీగా ఉన్నాను ’’ అని హీరోయిన్‌ ప్రియాంకా జవాల్కర్‌ అన్నారు. ఇంకా ప్రియాంక చెప్పిన విశేషాలు ఈ విధంగా...

‘‘తిమ్మరుసు’ విడుదలైన తర్వాత శరీరాకృతి గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అని నా గురించి కొందరి కామెంట్స్‌ వినిపించాయి. సడన్‌గా నాలో ఎందుకు మార్పులు వచ్చాయో నాక్కూడా అర్థం కాలేదు. బ్లడ్‌ టెస్ట్‌ చేయిస్తే థైరాయిడ్, ఇన్సులిన్‌ రెసిస్టెన్సీ అన్నారు. డాక్టర్స్‌ సలహాలతో ఫుడ్, వ్యాయామం ఇలా అన్ని అంశాల్లో కేర్‌ తీసుకుంటూ బరువు తగ్గాను. నా గురించి నేను కేర్‌ తీసుకోకపోవడం వల్లే బరువు పెరిగాను అనేది నిజం కాదు. మనం నిజంగా కనిపిస్తున్న దాని కంటే స్క్రీన్‌ పై 30 శాతం ఎక్కువగా కనిపిస్తాం. ఇది చాలామందికి తెలియదు. స్క్రీన్‌ మీద స్లిమ్‌గా కనిపించాలంటే నిజంగా చాలా చాలా స్లిమ్‌గా ఉండాలి.

బరువు తగ్గే ప్రక్రియ నాకు చాలా కష్టంగా అనిపించింది. ఫుడ్‌ కంట్రోల్, వర్కౌట్స్‌ ఇలా చాలా కష్టపడ్డాను. ప్రొటీన్‌ ఇంత తినాలి? ఫ్యాట్‌ ఇంత తినాలి? షుగర్‌ ఇంత అని డైట్‌ ప్లాన్‌ ఉంటుంది. ఒక దశలో షుగర్‌ లేని టీకి అలవాటు పడిపోయాను. ఇది  కరెక్ట్‌ కాదని నార్మల్‌ షుగర్‌ అలవాటు చేసుకుంటున్నాను. సరైన పద్ధతులతోనే తగ్గాను.

‘టాక్సీవాలా’ తర్వాత దాదాపు పాతిక కథలు విన్నాను. తమిళంలో ఓ సినిమా కమిటయ్యాను. నేను ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ పూర్తయింది. అందరు హీరోలు, దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అల్లు అర్జున్‌ నా క్రష్‌. ఓటీటీ ఆఫర్స్‌ వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్‌ కోసం చూస్తున్నాను. బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ కోసం ఆడిషన్స్‌ ఇస్తున్నాను. మంచి పాత్ర దక్కితే ఇతర భాషల్లోనూ నటిస్తాను.

మరిన్ని వార్తలు