సినిమాల కంటే వెబ్‌ సిరీసే వచ్చుతాయి: నటి

31 Jan, 2021 11:49 IST|Sakshi

‘కెమెరా.. యాక్షన్‌..’ అనగానే నటించడం నటులకు సహజమే. కానీ.. ఆ నటనలో సహజత్వాన్ని కలబోసి.. జీవించగలిగేవాళ్లు కొందరే ఉంటారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా.. ప్రేక్షకుల మనసుల్లో ముద్రపడేటంత గొప్పగా నటించి.. అభిమానుల గుండెల్ని కొల్లగొట్టేస్తారు. అలాంటి కోవకు చెందిన అమ్మాయే ఈ ప్రియాషా భరద్వాజ్‌. వెబ్‌ సిరీస్‌ ప్రియులంతా ఈమెను ‘సౌందర్య’ అని, ‘జమున’ అని తమ అభిమాన క్యారెక్టర్‌ పేరుతో గుర్తుపడుతుంటారు.

నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాషా.. అస్సాంలోని గౌహతిలో నవంబర్‌ 8న జన్మించింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో ‘ఆర్యా’,‘కాఫిర్‌’ సీరిస్‌లలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మీర్జాపూర్‌–2తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మేడిన్‌ హెవెన్‌’ వెబ్‌సిరీస్‌లో తన కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. అందులో ఐసీయూ నర్స్‌గా చిన్న పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగ్గట్టుగా రెండంటే రెండు లైన్ల డైలాగ్‌ చెప్పి..ఆ సిరీస్‌ డైరెక్టర్‌ చేతే ‘బాగా చేశావ్, నీకు మంచి ఫ్యూచర్‌ ఉంది’ అని చెప్పించుకుందంటే తన నటనాప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు అయిన  సత్యప్రసాద్‌ బారువా కుటుంబానికి చెందిన ప్రియాషా.. పాఠశాల విద్య సంస్కృత పాఠశాలలో చదివింది. సైకాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేసింది. చిన్నప్పటినుంచి భరతనాట్యం నేర్చుకున్న ప్రియాషా.. స్కూలు విద్య పూర్తి అయ్యాక, ఢిల్లీలో జాజ్, వెస్టర్న్‌ డ్యాన్స్‌లు నేరుకుంది. డిగ్రీ అయ్యాక సిటీబ్యాంక్‌లో ఉద్యోగినిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ప్రియషా.. ఆ జాబ్‌లో ఇమడలేక రిజైన్‌ చేసి.. ఫ్రీలాన్స్‌ కొరియోగ్రఫీ ప్రాజెక్టులను చేయడం ప్రారంభించింది. తర్వాత కార్పొరేట్‌ కొరియోగ్రఫీ, యాంకరింగ్, ఈవెంట్స్‌కి ఆర్టిస్ట్‌ మేనేజర్, అసిస్టెంట్‌ కాస్టింగ్‌ డైరెక్టర్, వాయిస్‌ ఓవర్‌ ఇలా చాలానే చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు యాక్టింగ్‌పై ఆసక్తి కలిగింది.

చిన్నప్పటి నుంచి సంగీతం, డ్యాన్స్‌ అంటే ఇష్టముండటంతో.. మోడలింగ్‌ వైపు అడుగుల వేసిన ప్రియషా.. దీపికా పదుకొనేతో కలిసి బ్రిటానియా గుడ్‌డే యాడ్‌లో నటించింది. తర్వాత యాడ్స్‌ ఆడిషన్స్‌ కోసం ముంబై షిఫ్ట్‌ అయ్యింది. యూనిసెఫ్‌కు సంబంధించి మదర్‌హుడ్‌ స్టోరీస్‌ యాడ్‌ సిరీస్‌లో డజన్ల సంఖ్యలో ఆమె యాడ్స్‌ చేసింది. సినిమాలకంటే వెబ్‌సిరీస్‌లే తనకు బాగా నచ్చుతాయంటుంది ప్రియాషా. ఎందుకంటే.. ‘సినిమాలతో పోలిస్తే వెబ్‌సిరీస్‌లలో స్క్రీన్‌ మీద ఎక్కువ సేపు మనల్ని మనం చూసుకోవచ్చు కదా’ అంటూ కొంటెగా సమాధానమిస్తోంది ఈమె.

2019లో ‘కాఫిర్‌’లో చాన్స్‌ వచ్చాక. ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు. ప్రముఖ నటి సుస్మితా సేన్‌ నటించిన ‘ఆర్యా’ వెబ్‌సిరీస్‌లో సేన్‌ చెల్లిగా సౌందర్య క్యారెక్టర్, మీర్జాపూర్‌–2లో జమున క్యారెక్టర్‌.. ప్రియాషాకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయంటారు ప్రియషా. ‘నేను 200 ఆడిషన్స్‌కు వెళ్తే.. 40 ఆడిషన్స్‌కి సెలెక్ట్‌ అయ్యాను.. అంటే నా పైన నెపోటిజం పెద్దగా ప్రభావితం చూపించలేదు..’ అంటుంది ప్రియాషా. ‘10–15 సంవత్సరాల తర్వాత నా సొంతూరు గౌహతి వెళ్లిపోయి.. అక్కడ ఉన్న పేద పిల్లలకు నటనలో ట్రైనింగ్‌ ఇస్తాను’ అంటోంది ప్రియషా. (చదవండి: 3 నిమిషాల పాట కోసం అనసూయకు రూ .20 లక్షలు!)

మరిన్ని వార్తలు