జూ.ఎన్టీఆర్‌ తన పిల్లల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయరు, కారణమిదే!

21 May, 2021 17:45 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నిన్నటితో (మే 20) 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. గురువారం ఆయన బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, దర్శక-నిర్మాతలు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపగా.. పరిశ్రమకు చెందిన కొందరు ఎన్టీఆర్‌ సన్నిహితులు ఆయనతో తమకు అనుబంధం గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే ఆయన పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు ఎన్టీఆర్‌ తన పిల్లలతో ఎలా ఉంటారు, వారు ఇంట్లో చేసే అల్లరి గురించి చెప్పాడు. అంతేగాక  అభిరామ్‌, భార్గవ్‌ రామ్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు.  

అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ మిగతా సెలబ్రెటీల మాదిరిగా తన పిల్లల వీడియోలను, ఫొటోలను సోషల్‌ మీడియాలో కానీ మీడియాతో పంచుకోవడం చాలా అరుదు. వారిని ఎప్పుడు మీడియాకు, పబ్లిక్‌కు దూరంగా ఉంచుతారు.  మూవీ వేడుకలకు కూడా పెద్దగా తీసుకువచ్చింది లేదు. దీనికి కారణం ఏంటో ఈ సందర్భంగా పీఆర్‌ఓ మహేశ్‌ కోనేరు వెల్లడించారు. ‘ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు అభిరామ్‌కు సిగ్గు, మొహమాటం ఎక్కువ, అసలు అల్లరి చేయడు, చాలా కామ్‌గా ఉంటాడు. ఇక చిన్న కుమారుడు భార్గవ్‌ రామ్‌,  అభిరామ్‌కు పూర్తిగా భిన్నం. చాలా అల్లరి. ఒక్కచోట కుదురుడుగా ఉండడు. చాలా చురుగ్గా ఉంటాడు. అచ్చం తన తం‍డ్రి ఎన్టీఆర్‌ లాగే. ఇక అభి, భార్గవ్‌లు ఒకరి కంపెనీని ఒకరు చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పాడు. 

అలాగే ఎన్టీఆర్‌ సాధ్యమైనంత వరకు వారికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తారని కూడా చెప్పాడు. ఇక తన పిల్లల వీడియోలను ఎన్టీఆర్‌ ఎందుకు విడుదల చేయరో చెబుతూ.. ‘తన పిల్లలను మీడియాకు, పబ్లిక్‌ దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన స్టార్‌డమ్‌ వారి బాల్యాన్ని ప్రభావితం చేయకూడదని ఆయన భావిస్తారు. అది ఆయనకు ఇష్టం కూడా లేదు. అందుకే అభి, భార్గవ్‌లకు సంబంధించిన ఫొటోలను కానీ, వీడియోలను ఎక్కువగా పంచుకోరు’ అంటూ పీఆర్‌ఓ మహేశ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు