ఇంట్లోనే వ్యాక్సిన్‌ తీసుకున్న సింగర్‌, అధికారుల ఆగ్రహం!

14 Jun, 2021 15:03 IST|Sakshi

గుజరాతీ జానపద గాయని గీతా రాబరి ఇంట్లోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఉదంతం వివాదాస్పదంగా మారింది. కచ్‌ జిల్లా మాదాపర్‌ గ్రామంలో హైల్త్‌ కేర్‌ వర్కర్‌ శనివారం సాయంత్రం ఆమెకు ఇంట్లోనే టీకా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను గాయని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది కాస్తా అధికారుల కంట పడింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఉన్న సమయంలో వైద్యసిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి మరీ టీకా ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు టీకా ఇచ్చిన వర్కర్‌కు నోటీసులు పంపారు.

ఈ విషయం గురించి కచ్‌ జిల్లా వైద్యాధికారి భవ్య వర్మ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ కోసం రాబరి స్లాట్‌ బుక్‌ చేసుకుందని తెలిపారు. కానీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే టీకా వేయించుకుందని పేర్కొన్నారు. ఎవరి ఆదేశాలతో ఆ వర్కర్‌ రాబరి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్‌ ఇచ్చింది? వంటి తదితర వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ వర్కర్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు.

కాగా గీతా రాబరి 'నమస్తే ట్రంప్‌' ఈవెంట్‌ సందర్భంగా జానపద గీతాలతో జనాలను అలరించింది. ఇదిలా వుంటే ఇటీవలే క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా కాన్పూర్‌లోని గెస్ట్‌ హౌస్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న అంశం వివాదాస్పదమైంది. ఇది మరువకముందే సింగర్‌ గీతా రాబరి ఇంట్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వార్త సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు అందరూ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో టీకా వేయించుకుంటే ఈవిడ మాత్రం ఇంట్లోనే టీకా పొందడమేంటని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: డైరెక్టర్‌ వివాహం..హాజరైన హీరోలు పునీత్‌, ధృవసర్జా

నా బలం... బలహీనత అదే : ప్రియాంక చోప్రా

మరిన్ని వార్తలు