Sekhar Movie: నా సినిమాను చంపేశారు: శేఖర్‌ నిర్మాత ఆవేదన

24 May, 2022 12:36 IST|Sakshi

జీవిత దర్శకత్వంలో ప్రముఖ నటుడు రాజశేఖర్‌ హీరోగా నటించిన చిత్రం శేఖర్‌. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తున్న సమయంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. అయితే శేఖర్‌ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని తాము చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

దీంతో నిర్మాత సుధాకర్‌ రెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను శేఖర్‌ సినిమా నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్‌ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను, కానీ వాళ్లు శేఖర్‌ సినిమాను చంపేశారు. ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పని చేశాను, ఫైనాన్స్‌ కూడా ఇచ్చాను. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదు. లీగల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సినిమాలో శివానీ, శివాత్మికల పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఆపేయడం వల్లే మా సినిమా ఆగిపోయింది. అసలు శేఖర్‌ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు.

డిజిటల్‌ ప్రొవైడర్స్‌ క్యూబ్‌, యూఎఫ్‌ఓలపై న్యాయపోరాటం చేస్తాం. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. నిజానికి నాకు ఆ పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఇస్తారా? ఇది రాజశేఖర్‌ సినిమా కాదు, రాజశేఖర్‌ నటించిన సినిమా మాత్రమే! అలాగే జీవిత సినిమా కూడా కాదు, కేవలం జీవిత దర్శకత్వం చేసిన మూవీ. సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ నా పేరు మీదే ఉంది. శేఖర్‌ సినిమాకు నేను రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాను. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి 👇
విజయ్, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదు..

నీ బాంచన్‌, జర ఆదిపురుష్‌ అప్‌డేట్‌ ఇవ్వరాదే..

మరిన్ని వార్తలు