తెలుగోడి జానపదం దమ్ము చూపించింది

21 Sep, 2023 01:40 IST|Sakshi

– నిర్మాత ‘బన్నీ’ వాసు 

‘‘ఒక పాట హిట్‌ అయితే సక్సెస్‌ మీట్‌ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్‌’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్‌ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు.

రంజిన్‌ రాజ్, మిధున్‌ ముకుందన్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్‌ విజయ్‌. ‘‘ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్‌. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని.

మరిన్ని వార్తలు