కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌ మూవీ ‘మీటర్‌’: చెర్రీ

5 Apr, 2023 09:00 IST|Sakshi

‘‘కథ పరంగా ‘మీటర్‌’ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు.. కమర్షియల్‌గా కూడా చూపించొచ్చు. డైరెక్టర్లు బాబీ, గోపీచంద్‌ మలినేని వద్ద పని చేసిన అనుభవంతో దర్శకుడు రమేష్‌ ‘మీటర్‌’ని కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చక్కగా తీశాడు’’ అని నిర్మాత చిరంజీవి (చెర్రీ) అన్నారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్‌ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్‌’. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘మా క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘ఒక్కడున్నాడు, మత్తు వదలరా, హ్యాపీ బర్త్‌ డే’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీశాం. తొలిసారి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తే బాగుంటుందని ‘మీటర్‌’ చేశాం. చాలా బలమైన కథతో రమేష్‌ ఈ సినిమాని తీశాడు. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ చూసి కిరణ్‌ని ‘మీటర్‌’కి తీసుకున్నాం.

ఏ పాత్ర అయినా చేయగల సత్తా ఉన్న నటుడు కిరణ్‌. తన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌ మూవీ ఇది. ప్రయోగాత్మక చిత్రాలకు మంచి పేరు రావచ్చు కానీ డబ్బులు రావు. ‘మీటర్‌’ లాంటి మూవీస్‌కి సినిమా బావుందంటే మాత్రం బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఓటీటీల ప్రభావం థియేటర్స్‌పై పెద్దగా ఉండదు. సినిమా బావుంది అంటే తప్పకుండా థియేటర్లకి వెళతారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల రిలీజైన ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’. చిన్న సినిమాలకు స్కోప్‌ లేదని నేనెప్పుడూ అనుకోలేదు. మంచి కథ కుదిరితే మళ్లీ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం రితేష్‌ రానా దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు