కరాబు క్రేజ్‌

4 Dec, 2020 06:20 IST|Sakshi

ధృవ్‌ సర్జా, రష్మికా మందన్నా జంటగా నందన్‌ కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’. ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌తో చాలామంది తెలుగు హక్కుల కోసం పోటీపడగా వైజాగ్‌కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్‌ డి. ప్రతాప్‌రాజు సొంతం చేసుకున్నారు. సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌  బ్యానర్‌పై ఈ సినిమాని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భగా నిర్మాత డి. ప్రతాప్‌రాజు మాట్లాడుతూ– ‘‘ఒక్క పాటతో యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో రికార్డ్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుని, ట్రెండింగ్‌లో ఉన్న ‘పొగరు’ చిత్రం తెలుగు హక్కులను 3కోట్ల 30 లక్షలకి సొంతం చేసుకున్నాం. చందన్‌ శెట్టి, అర్జున్‌ జన్య సంగీతం సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులో ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు