ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు

14 Sep, 2022 03:48 IST|Sakshi

ప్రముఖ నటుడు కృష్ణంరాజు గత ఆదివారం (11న) కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంతాప సభలో కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి పాల్గొన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు, నేను, చంద్ర మోహన్‌ ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో ఉన్నాం. మా అన్నయ్య కృష్ణగారితో ఎంత స్వంతంత్రంగా ఉండేవాణ్ణో కృష్ణంరాజుగారితో కూడా అలాగే ఉండేవాణ్ణి.

అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు లేని బాధ ఆయన కుటుంబానికే కాదు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లకి కూడా ఉంటుంది. నన్ను తొలిసారి బెంజి కారులో ఎక్కించింది కృష్ణంరాజుగారు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు’’ అన్నారు. నిర్మాత రమేశ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పటి నుంచి నేను, కృష్ణంరాజు ఫ్రెండ్స్‌. మా తండ్రిగారికి (ఎల్వీ ప్రసాద్‌) కూడా కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం’’ అన్నారు.

దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నిజం చెప్పాలంటే ఇక్కడ మాట్లాడటానికి సిగ్గు పడే పరిస్థితుల్లో ఉన్నాను. మూడేళ్ల క్రితం ఆయన మూవీ టవర్స్‌కి వచ్చి మార్కెట్‌ ధరకు ఫ్లాట్‌ కొనుక్కుంటానని అడిగారు.. కారణాలేవైనా ఫ్లాట్‌ ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇండస్ట్రీలో పెట్టే ఏ అసోసియేషన్స్‌ అయినా కూడా మన సభ్యుల మంచి కోసం పెడతాం.. కానీ వ్యాపారం చేయాలనుకుంటే అంతకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఉండదు’’ అన్నారు. నటుడు బాబూమోహన్‌ మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజు అన్నగారి ‘పాపే నా ప్రాణం’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను.

24క్రాఫ్ట్స్‌లో ఆయన గురించి ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు’’ అన్నారు.  ‘తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడు బసిరెడ్డి, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’ ప్రెసిడెంట్‌ కాశీ విశ్వనాథ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, నటి జీవితతో పాటు పలువురు దర్శక–నిర్మాతలు, నటీనటులు, టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు