'ఆర్‌ఆర్‌ఆర్‌' టీం..పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు తీసుకొచ్చారు: నిర్మాత

9 Apr, 2023 07:38 IST|Sakshi

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ‘ఆస్కార్‌’ వంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడమంటే ఇండియాకి వచ్చినట్టే. ఇందుకు ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువారు గర్వించాల్సిన సమయం ఇది’’ అని నిర్మాత కేఎస్‌ రామారావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ అవార్డులకంటే గొప్ప అవార్డు తీసుకొచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌ని, సాంకేతిక నిపుణులను మనం సన్మానించుకోవాలి.. గౌరవించుకోవాలి.

ఎందుకంటే ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌ని, అవార్డు గ్రహీతలను చాలా గొప్పగా సత్కరించాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వంతుగా ‘ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’ కార్యవర్గం ఆధ్వర్యంలో నేడు శిల్ప కళావేదికలో సన్మానం చేస్తుండటం చాలా గొప్ప విషయం. ఇందులో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు