పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో?

31 Aug, 2021 03:37 IST|Sakshi

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు, ఇప్పటి సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిగారు చిత్రపరిశ్రమకు అన్నీ ఇచ్చారు. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. మరి.. చంద్రబాబుగారు ఇండస్ట్రీకి ఏం చేశారో వాళ్లు చెప్పాలి?’’ అని దర్శక–నిర్మాత నట్టి కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పంచుకున్న విషయాలు..

► ‘ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వస్తున్నది పాతిక కోట్లు మాత్రమే. నేను ఇంకో పాతిక కోట్లు ఇస్తా. ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేద్దామో చెప్పి చేయించుకోండి’ అని ఓ సందర్భంలో రాజశేఖర రెడ్డిగారు అన్నారు. అప్పట్లో ఇండస్ట్రీ కోసం విశాఖపట్నంలో 326 ఎకరాలు కేటాయించి, స్డూడియోలు, ఇతర సౌకర్యాలకు అనుగుణంగా మార్చుకోమన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ స్థలాలను వేరే కంపెనీలకు ఇచ్చింది. అది జగన్‌మోహన్‌ రెడ్డిగారు క్యాన్సిల్‌ చేశారు. ఆ స్థలం అలాగే ఉంది. ఇండస్ట్రీకి ఆంధ్రా నుంచే 65 శాతం ఆదాయం వస్తోంది. అలాంటప్పుడు ట్యాక్స్‌ కట్టి అక్కడి ప్రభుత్వానికి మేలు జరిగేలా అక్కడ కూడా షూటింగ్‌లు జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

► షూటింగ్‌ల కోసం ఏపీలో సింగిల్‌ విండో విధానం అమలులో ఉంది. అలాంటప్పుడు ఆంధ్రాలో ఎందుకు షూటింగ్‌లు చేయరు? జగన్‌ గారు అపాయింట్‌మెంట్‌ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అది తప్పు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. జగన్‌ గారిని అడిగితే వీలైనంత త్వరగా స్పందిస్తారు.

► ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35 చిన్న నిర్మాతల పాలిట ఓ వరం. ఈ జీవోను ఉపసంహరించుకోకూడదని కోరడానికి చిన్న నిర్మాతల తరఫున సీయం గారి అపాయింట్‌మెంట్‌ కోరాను. కానీ, ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న ఓ వర్గం వారు ఈ జీవో విషయంలో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని వచ్చేలా ప్రవర్తిస్తున్నారు.  

► జగన్మోహన్‌ రెడ్డి గారిని కలిసినప్పుడు చిరంజీవిగారు చిన్న నిర్మాతల సమస్యలను కూడా ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన సినిమాలకు మంచి షేర్స్‌ వస్తున్నాయి. అయినా కొందరు పెద్ద సినిమాలను విడుదల చేయకుండా వేరే ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు.

► చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా టిక్కెట్‌ ధరలను పెంచేస్తున్నారు. ప్రేక్షకుల సొమ్మును హీరో హీరోయిన్లకు పారితోషికం రూపంలో ఇస్తున్నారు. ఓ ఐదుగురు పెద్ద టెక్నీషియన్స్‌ను, హీరోలను, హీరోయిన్లను మనం పెంచుతున్నాం.

మరిన్ని వార్తలు