కరోనాతో యు. విశ్వేశ్వరరావు కన్నుమూత

21 May, 2021 00:15 IST|Sakshi

ప్రముఖ దర్శక–నిర్మాత, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) వియ్యంకుడు యు. విశ్వేశ్వర రావు (92) ఇక లేరు. గురువారం ఆయన చెన్నైలో కరోనాతో కన్నుమూశారు. విశ్వేశ్వర రావు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో మేనమామ చేరదీశారు. విశ్వేశ్వరరావును బాగా చదివించాలనుకున్న బావ దావులూరి రామచంద్రరావు బి.ఎస్సీ వరకు చదివించారు. ఆ తర్వాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరారు విశ్వేశ్వరరావు. చదువు చెప్పిన టీచర్లకు సహ ఉపాధ్యాయుడిగా చేశారాయన. గుడివాడలోనే జనతా ట్యుటోరియల్‌ ఇ¯Œ స్టిట్యూట్‌ స్థాపించి కొంతకాలం నడిపారు. ఎన్టీఆర్‌ ప్రోద్బలంతో సినీ రంగంలోకి వచ్చారు.

పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరి, ‘కన్యాశుల్కం’, ‘జయభేరి’ చిత్రాలకు పని చేశారు విశ్వేశ్వరరావు. ఆ సమయంలో ‘బాలనాగమ్మ’ సినిమా తమిళ డబ్బింగ్‌ హక్కులు కొని నిర్మాతగా మారారు. ఆ చిత్రం మంచి లాభాలు తీసుకురావడంతో కుమార్తె శాంతి పేరుతో ‘విశ్వశాంతి’ అనే సంస్థను స్థాపించారు. పలు అనువాద చిత్రాలను అందించారు. ఎన్టీఆర్‌తో  ‘కంచుకోట’, ‘నిలువు దోపిడీ’, ‘పెత్తందార్లు’, దేశోద్ధారకులు వంటి చిత్రాలు నిర్మించారాయన. తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనుకునేవారు. కానీ, అలాంటి  చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా మారి, ‘తీర్పు’, ‘నగ్నసత్యం’, ‘హరిశ్చంద్రుడు’, ‘కీర్తి కాంత కనకం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా, రచయితగా రెండు నంది అవార్డ్స్‌ అందుకున్నారు.

కుమార్తె శాంతిని ఎన్టీఆర్‌ కుమారుడు– కెమేరామ్యాన్‌ మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అలా రామారావుకి విశ్వేశ్వర రావు వియ్యంకుడు అయ్యారు. 1986లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. ఆ సమయంలో ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు చేశారు. ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ చైర్మన్‌తో పాటు సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో అనేక పదవుల్లో తన సేవలు అందించారు. విశ్వేశ్వర రావుకి కుమార్తెలు మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్‌ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఒక కుమార్తె హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తండ్రి కడచూపునకు కూడా పిల్లలు చేరుకోలేని పరిస్థితి. దీంతో విశ్వేశ్వరరావు భౌతికకాయానికి గురువారం చెన్నైలో ఆయన మిత్రులే అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వేశ్వరావు మృతి పట్ల తెలుగు సినీ నిర్మాతల మండలి, హీరో బాలకృష్ణ, సౌతిండియన్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌ తదితరులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు