సుశాంత్‌ మృతి : నిర్మాతల మండలి బహిరంగ లేఖ

4 Sep, 2020 19:26 IST|Sakshi

సినీ నేపథ్యం లేనివారూ ఎదిగారు : ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌

ముంబై : యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషాదాంతం బాలీవుడ్‌లో బంధుప్రీతి, పక్షపాత వైఖరితో పాటు డ్రగ్స్‌ వంటి పలు అంశాలపై గత కొద్ది వారాలుగా వాడివేడి చర్చ సాగుతోంది. స్టార్‌కిడ్స్‌కే బాలీవుడ్‌లో పెద్దపీట వేస్తారని సుశాంత్‌ సన్నిహితులు, సెలబ్రిటీలు గళం విప్పడంతో పాటు సోషల్‌ మీడియాలోనూ భారీ చర్చే నడిచింది. దీనిపై భారత చలనచిత్ర నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) స్పందిస్తూ శుక్రవారం బహిరంగ లేఖతో ముందుకొచ్చింది. యువ హీరో విషాదాంతాన్ని సినీ పరిశ్రమతో పాటు పరిశ్రమ సభ్యుల ప్రతిష్టను దిగజార్చేలా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి రంగంలో మాదిరే సినీ పరిశ్రమలోనూ లోటుపాట్లు ఉన్నాయని, వీటిని సరైన దిశలో చక్కదిద్దుకోవచ్చని, అయితే పరిశ్రమ అంతటినీ ఒకే గాటనకట్టడం సరైంది కాదని స్పష్టం చేసింది. చదవండి : సిద్దార్థ్‌ శుక్లా నన్ను చాలా హింసించాడు...

సినీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి ఇస్తూ కోట్లాది మందికి శతాబ్ధానికి  పైగా వినోదం అందిస్తోందని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. హాలీవుడ్‌ ప్రాబల్యాన్ని తట్టుకుని పలు భాషా చలనచిత్ర పరిశ్రమలతో పాటు బాలీవుడ్‌ నిలదొక్కుకుందని వివరించింది. ఆపద సమయాల్లో చిత్ర పరిశ్రమ దేశ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తుచేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైపుణ్యాలను బాలీవుడ్‌ ఆహ్వానించిందని, నూతన నైపుణ్యాలను పరిశ్రమ అడ్డుకుందని ప్రచారం చేయడం అవాస్తవమని తెలిపింది. పరిశ్రమకు సంబంధం లేని ఎంతోమంది ఫిల్మ్‌ ప్రొఫెషనల్స్‌ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని, వీరిలో నటులు, డైరెక్టర్లు, రచయితలు, సంగీత దర్శకులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ప్రొడక్షన్‌ డిజైనర్లు, ఆర్ట్‌ డైరెక్టర్లు, కాస్ట్యూమ్‌ డిజైనర్లు వంటి ఎందరో ప్రొఫెషనల్స్‌ సినీ నేపథ్యం లేకుండానే ఎదిగారని తెలిపింది. సినీ పరిశ్రమలో కొత్తవారు నెగ్గుకురాలేరని మీడియాలోనూ తప్పుదారిపట్టించే కథనాలు రావడం బాధాకరమని పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా