అక్షయ్‌ కుమార్‌కు చేదు అనుభవం.. దిష్టిబొమ్మ దహనం

17 Jun, 2021 20:16 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఇండియా టుడే

బాలీవుడ్‌ కిలాడి హీరో అక్షయ్‌ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్‌ సినిమాకు వ్యతిరేకంగా చంఢీగఢ్‌లో ఆందోళనలు చేపట్టారు. గతంలో జోధా అక్భర్‌, పద్మావతి సినిమాలు వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. కొంచెం అలాంటి వివాదమే ఇప్పుడు పృథ్వీరాజ్‌ను  చుట్టుముట్టింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ మార్చాలని కోరుతూ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృ‍త్వంలోని నాయకులు నిరసనలు చేపట్టారు. అంతేగాక అక్షయ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

సంఘంలోని వ్యక్తులు మాట్లాడుతూ.. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్‌గా ఉండకూడదని.. పూర్తి పేరు ‘హిందూ సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌’ లేదా ‘చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఉండాలని డిమాండ్‌ చేశారు. ఎందుకంటే పృథ్వీరాజ్‌ చౌహన్‌ చివరి హిందూ చక్రవర్తి అని, అలాంటి సందర్భంలో ఈ చిత్రం పేరు అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్‌పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. అందువల్ల ఈ చిత్రంలో ఏదైనా వివాదం ఉందా అని, చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తెలుస్తుందని, అప్పుడే ఆ సన్నివేశాలను తొలగించేదుకు కోరవచ్చని అన్నారు. 

అయితే పృథ్వీరాజ్‌ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్న వివాదాలను తొలగించాలని, లేకపోతే క్షత్రియ సమాజ్‌.. పద్మావతి, జోధా అక్బర్‌ సినిమాలకు ఎదురైన పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు స్టార్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. 

చదవండి: ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్‌ కుమార్‌

మరిన్ని వార్తలు