Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం

16 Nov, 2021 17:43 IST|Sakshi

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత పునీత్‌ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అప‍్పు ( పునీత్‌ రాజ్‌ కుమార్‌) మరణాంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించనున్నారు. కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ప‍్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌ వేదికగా తెలిపారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ‍్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్‌ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు.

మరిన్ని వార్తలు