పునీత్‌ రాజ్‌కుమార్‌ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన ఆన్నయ్య

14 Sep, 2023 12:13 IST|Sakshi

మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్‌ (శివన్న),రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్‌ రాజ్‌కుమారు అని తెలిసిందే.

(ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్‌)

తాజాగా పునీత్‌ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్‌ రాజ్‌కుమార్‌ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు.  తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్‌ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్‌కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే  కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు

పునీత్‌ రాజ్‌కుమార్‌ రక్తసంబంధానికి మంచి మెసేజ్‌ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్‌లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్‌ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్‌)

'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి  మా ఇంటి బాధ్యతను పునీత్‌ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్‌ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తుచేసుకున్నాడు.

మరిన్ని వార్తలు