Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. టీజర్‌ రిలీజ్‌

26 Jul, 2022 10:25 IST|Sakshi

Lucky Man Teaser Released: కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం కన్నా ముందు కమిట్‌ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు.

అయితే పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులకు త్వరలోనే సర్‌ప్రైజ్‌ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్‌ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్‌'తోపాటు 'లక్కీ మ్యాన్‌' కూడా ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్ గెస్ట్‌ రోల్‌ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్‌ చేసింది చిత్రబృందం. రొమాంటిక్‌ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్‌ రాజ్‌ కుమార్‌ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్‌ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్‌ రాజ్‌కుమార్‌ చేసే డ్యాన్స్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్‌ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్‌ హీరోహీరోయిన్లుగా నటించారు.  

మరిన్ని వార్తలు