బాల్కీ ప్రయోగం..సన్నీ డియోల్, దుల్కర్‌ సల్మాన్‌తో థ్రిల్లర్‌ మూవీ

13 Aug, 2021 12:43 IST|Sakshi

చీనీ కమ్, పా, ప్యాడ్‌ మ్యాన్‌... ఇలా బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌. బాల్కీ తెరకెక్కించినవన్నీ విభిన్న చిత్రాలే. హిందీ సినిమా ఒక రూట్‌లో వెళుతుంటే బాల్కీ వేరే రూట్‌లో వెళ్లి సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు చార్‌ (నాలుగు) జోర్‌ చూపించడానికి రెడీ అయ్యారు. సన్నీ డియోల్, దుల్కర్‌ సల్మాన్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ నలుగురూ ప్రధాన తారాగణంగా బాల్కీ ఓ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కించనున్నారు.

‘‘సన్నీ డియోల్‌ లాంటి అద్భుత నటుడితో ఓ కొత్త అడ్వంచర్‌ మూవీ చేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమా కెరీర్‌లో ఇది ఓ కొత్త కోణం చూపించే సినిమా అవుతుంది. అలాగే ఇండియన్‌ సినిమాలో ఉన్న చార్మింగ్‌ యాక్టర్స్‌లో దుల్కర్‌తో సినిమా చేయడం ఓ ఆనందం.

విలక్షణ నటి పూజా భట్‌ ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోరు. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం ఓ మంచి విషయం. ఇక, ‘స్కామ్‌ 1992’లో అద్భుతంగా నటించిన శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో భాగం కావడం మరో మంచి విషయం’’ అని బాల్కీ అన్నారు. త్వరలో షూటింగ్‌ ఆరంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని వార్తలు