అన్నదాతల ఉద్యమానికి ఊతం ‘రైతన్న’: ఆర్‌ నారాయణమూర్తి

28 Jul, 2021 10:36 IST|Sakshi

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం ఇతివృత్తంగా ‘రైతన్న’ చిత్రాన్ని రూపొందించాను. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ సినిమా కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘రైతులకు కావాల్సింది ఒకే ధర, ఒకే మార్కెట్‌ కాదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటాలు సాగిస్తున్న అన్నదాతలపై ‘రైతన్న’ తీశాను. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో 75 శాతం మందికి సినిమానే వినోదం. సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘రైతు ఉద్యమానికి ‘రైతన్న’ సినిమా గొప్ప ఊతం ఇస్తుంది’’ అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు . ‘‘రైతులే ప్రధానాంశంగా నారాయ ణమూర్తి సినిమా తీయడం గొప్ప విషయం’’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు అన్నారు. రైతు సంఘాల నాయకులు ఆర్‌. వెంకయ్య, వై. కేశవరావు, జమలయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు