షూటింగ్‌ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం

11 May, 2021 00:31 IST|Sakshi

– ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’ యూనిట్‌ ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అది కూడా ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, సెలైన్‌ స్టాండ్లు.. ఇలా సెట్‌లో భాగంగా వేసినవన్నీ కూడా ఇచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ‘రాధేశ్యామ్‌’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి సెట్‌ వేశారు. వీటినే ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రికి ఇచ్చారు. ఈ విషయం గురించి రవీందర్‌ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ఆస్పత్రి డాక్టర్‌ నా ఫ్రెండ్‌. బెడ్లు కొరత ఉందంటే.. ఓ పది ఎరేంజ్‌ చేశాను. అయితే అవి ‘రాధేశ్యామ్‌’ సెట్‌వి కాదు. ఆ తర్వాత ఇంకా కావాలని అడిగితే, ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా వైఫ్‌ సంధ్య సినిమా సెట్‌లోవి ఇవ్వొచ్చు కదా అంది. ఆస్పత్రివాళ్లతో అంటే.. ‘సినిమాకి వేసినవి కదా.. పేషెంట్లకు సౌకర్యంగా ఉంటాయో? లేదో’ అన్నారు. ఫొటో పంపించాను.

నిజానికి నేను అచ్చం ఆస్పత్రికి వాడే బెడ్లులాంటివే సెట్‌ వేశాను. బెడ్‌ హైట్‌ ఎంత ఉండాలి? పొడవు వంటివన్నీ ముందే తెలుసుకుని వేశాను. పైగా 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి, అప్పటి బెడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే తయారు చేశాం. ఆస్పత్రివారికి బాగా అనిపించడంతో.. అన్నింటినీ శానిటైజ్‌ చేసి, 13 ట్రక్కుల్లో మొత్తం 50 బెడ్లు, ఇతర పరికరాలు పంపించాం. ఆ తర్వాత ఇంకోటి చూడండి అని ఫోన్‌ చేసినప్పుడు, చాలా బాధ అనిపించింది.

అది మాత్రమే కాదు.. ట్రక్కులు బయలుదేరాక... ఇంకో అరగంట పడుతుందా? గంటలో చేరతాయా? అంటూ... ఆస్పత్రివారు ఆదుర్దాగా ఫోన్‌ చేశారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోండి.  ఆ తర్వాత ఇంకో బెడ్‌ ఉందా? అని అడిగితే, రెండు పంపించాం’’ అన్నారు. ఈ సెట్‌లో షూటింగ్‌ పూర్తయిందా? అంటే ‘లేదు. ప్రభాస్‌ మీద ఒక భారీ సీన్‌ తీయాలి. కానీ మా నిర్మాతలు అదేం ఆలోచించలేదు. ఈ సమయంలో హెల్ప్‌ చేయాలి. తర్వాత సంగతి తర్వాత అన్నారు. హ్యాపీగా ఇచ్చేశాం. మా యూనిట్‌ నుంచి ఈ విధంగా హెల్ప్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు