నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు: రాధిక అసహనం

9 Apr, 2021 18:17 IST|Sakshi

నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్‌ బౌన్స్‌ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్‌ బౌన్స్‌ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

నటుడు శరత్‌ కుమార్‌, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్‌ ఫ్రేమ్స్‌ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్‌ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్‌ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ వేసింది.

దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్‌కుమార్‌ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్‌ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్‌ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్‌ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్‌ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్‌ జారీచేసింది.

చదవండి: రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు షాక్‌

కమల్‌ హాసన్‌, అజిత్‌ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన

మరిన్ని వార్తలు