Raghava Lawrence: చిన్నారులను దత్తత తీసుకున్న రాఘవ లారెన్స్

12 Apr, 2023 07:34 IST|Sakshi

తమిళ స్టార్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 150 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని  సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. పిల్లలతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

తాజాగా ఆయన నటిస్తున్న 'రుద్రన్' (తెలుగులో 'రుద్రుడు') మూవీ ఆడియా లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. కాగా.. గతంలో గుండె సమస్యలతో బాధపడుతున్న 141 మంది చిన్నారులకు సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరైనా.. ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, హార్ట్‌ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా.. వెంటనే లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సంప్రదించాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు.

లారెన్స్ నటించిన 'రుద్రన్' తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లారెన్స్ మాట్లాడారు. సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని తెలిపారు. తెరపైనే కాదు.. నిజ జీవితంలో హీరోగా ఉండాలన్న తన మాతృమూర్తి చెప్పిన మాటను ఆయన గుర్తుచేసుకున్నారు. కతిరేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన‘రుద్రన్‌’ ఈ నెల 14న విడుదలకానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు లారెన్స్‌ ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

మరిన్ని వార్తలు