Raghava Lawrence: ఎంతోమందికి లైఫ్‌ ఇచ్చిన హీరో విజయ్‌కాంత్‌.. ఆయన కుమారుడి కోసం..

10 Jan, 2024 15:58 IST|Sakshi

కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్‌ 28న కన్నుమూశారు. ఆయన మరణవార్త విని సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టుకోగా మరికొందరు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్‌కాంత్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు.

అతడి సినిమాలో చేస్తా
ఆ సమయంలో కెప్టెన్‌ తనయుడు షణ్ముగ పాండియన్‌ కెరీర్‌ బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఇంటిసభ్యులు రాఘవను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు రాఘవ కీలక ప్రకటన చేశాడు. 'షణ్ముగ పాండియన్‌ నెక్స్ట్‌ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను. వీలైతే దర్శకులు మల్టీస్టారర్‌ కాన్సెప్ట్‌తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్‌ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్‌ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్‌ చేశాడు. విజయ్‌కాంత్‌ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించాడు.

అలా తెలుగువారికీ పరిచయం
నల్ల ఎంజీఆర్‌, పురట్చి కలైజ్ఞర్‌, కెప్టెన్‌.. ఎలా పలు పేర్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌కాంత్‌. తమిళంలో ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందుకున్న ఆయన ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఛాలెంజ్‌ రౌడీ, పోలీస్‌ అధికారం, కెప్టెన్‌, మా బావ బంగారం, సింధూరపువ్వు, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం.. ఇలా ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమవడంతో ఇక్కడివారికీ సుపరిచితులయ్యారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు
నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకునేవారు కాదు. అలాగే తన కార్యాలయంలో నిత్యాన్నదానం చేసేవారు. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేసేవారు. అలాగే ఎందరో నటీనటులను ప్రోత్సహించి మంచి కెరీర్‌ అందించారు. ఈయన చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేసిన సహాబ్దం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.

చదవండి: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్!
విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?: సైంధవ్‌ హీరోయిన్‌

>
మరిన్ని వార్తలు