అమ్మని ఇష్టపడేవాళ్లు రుద్రుడుని ఇష్టపడతారు

14 Apr, 2023 04:04 IST|Sakshi

– రాఘవా లారెన్స్‌

‘‘అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలను బ్యాలెన్స్‌  చేయడం మొదట్లో కష్టంగా ఉండేది. తర్వాత అలవాటైంది. ఇప్పటివరకూ దాదాపు 150 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించాను. సినిమాల్లో హీరోగా ఉండటం కంటే రియల్‌ లైఫ్‌లో హీరోగా ఉండాలనేది నా కోరిక’’ అన్నారు రాఘవా లారెన్స్‌. కతిరేశన్‌ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ప్రియా భవానీ శంకర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. నిర్మాత ‘ఠాగూర్‌’ మధు ‘రుద్రుడు’ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్‌ చెప్పిన విశేషాలు.

► ‘రుద్రుడు’ మదర్‌ సెంటిమెంట్‌ ఫిల్మ్‌. నా ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం ఉన్నట్టే ఇందులోనూ అమ్మానాన్నల గురించి ఓ చక్కని సందేశం ఉంది. ఈ చిత్రంలో ఐటీ ఉద్యోగం చేసే ఒక మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాను. అలాంటి మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్‌గా మార్చాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. అమ్మని ఇష్టపడేవాళ్లంతా ‘రుద్రుడు’ మూవీని ఇష్టపడతారు.

► నన్ను కొత్తగా చూపించాలనే కతిరేశన్‌గారి తపన నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, థ్రిల్, వినోదం, మాస్‌ ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకు వంద శాతం చేరువ అవుతాయి. 

► ‘ఠాగూర్‌’ మధుగారు నాకు లక్కీ ప్రొడ్యూసర్‌. నాపై ఆయనకి చాలా నమ్మకం. మరోసారి ఆ నమ్మకాన్ని ‘రుద్రుడు’ నిలబెట్టుకుంటుంది. ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌గారు విలన్‌గా చేశారు. నా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఆయన పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘అఖండ’ సినిమా ఫైట్స్‌ నాకు నచ్చడంతో ఆ మూవీకి పని చేసిన శివ మాస్టర్‌ని తీసుకున్నాం. ‘రుద్రుడు’లో కథకు తగ్గట్టు యాక్షన్‌ని డిజైన్‌ చేశారాయన. ప్రస్తుతం ‘చంద్రముఖి 2, జిగర్తాండ 2’ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందించి, నిర్మిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. 

మరిన్ని వార్తలు