Rajinikanth: ర‌జ‌నీకాంత్ సినిమాలో విల‌న్‌గా ఆయ‌న వీరాభిమాని

4 Nov, 2023 15:30 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు ఎంతో అభిమానం. రాఘవ లారెన్స్‌ ఏ కార్యక్రమాన్ని మొదలెట్టినా ముందుగా తన గురువు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకుంటారు. కాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చంద్రముఖి–2 చిత్రంలో రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించే ముందు రాఘవ లారెన్స్‌ తన గురువు రజనీకాంత్‌ను కలిసి ఆశీర్వాదం పొందారు.

ఇదిలా ఉంటే జైలర్‌ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ర‌జ‌నీ త‌న కూతురు ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో లాల్ స‌లాం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. ప్రస్తుతం జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 170వ చిత్రం అవుతుంది. కాగా 171 చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారు.

ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించి ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి ఇందులో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా రాఘవ లారెన్స్‌ నటించినున్నారట‌! ఇది ఎంతవరకు నిజమో కానీ ఇదే జరిగితే చిత్రానికి మరింత హైప్‌ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని వార్తలు