Raghavendra Reddy : ఇక నేను ఏ జానర్‌లో అయినా కథలు రాయగలను

16 Dec, 2022 18:52 IST|Sakshi

ఇంద్రసేన హీరోగా వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్‌ బకుని హీరోయిన్‌. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘పొలిటికల్‌ జర్నలిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రైటర్‌ అవ్వాలనుకున్నాను. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులభం కాదని తెలిసింది. దీంతో సినిమా జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, టీవీ చానెల్స్‌కు శాటిలైట్‌ కన్సల్టెంట్‌గా చేశాను. ఇలా ఇండస్ట్రీలో నాకంటూ కొంత గుర్తింపు లభించడంతో రచయితగా కెరీర్‌ ఆరంభించాలనుకున్నాను. నా ఫ్రెండ్‌ ఇంద్రసేన కోసమే ఈ సినిమా కథ రాశాను. రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసినప్పటికీ ఇది ఏ రాజకీయ పార్టీ గురించిన సినిమా కాదు.

‘శాసనసభ’ అంటే పవిత్రమైన దేవాలయంతో సమానం. అటువంటి శాసనసభ గొప్పతనాన్ని ఈ తరంవారికి ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాను. యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటర్లు పవిత్రమైన ఓటును అమ్ముకోకూడదు. ఈ సినిమా వల్ల కనీసం కొంతమంది ఆలోచించినా, ఇద్దరు, ముగ్గురు మారినా మేం సక్సెస్‌ అయినట్లుగా భావిస్తాను. దర్శకుడు వేణు ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ఇక నేను ఏ జానర్‌లో అయినా కథలు రాయగలను. అయితే కమర్షియల్‌ అంశాలు ఉండేలా చూసుకుంటాను. ప్రస్తుతం ఓ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్, ఓ క్రైమ్‌ సబ్జెక్ట్‌కు కథలు అందించాను’’ అని అన్నారు.    

మరిన్ని వార్తలు