రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే 

22 Sep, 2020 06:16 IST|Sakshi

రాగిణి, సంజనల అర్జీపై సీసీబీ వాదనలు  

విచారణ 24కి వాయిదా   

సాక్షి, కర్ణాటక: డ్రగ్స్‌ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో రిమాండులోనున్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్‌ పిటిషన్ల విచారణను బెంగళూరు ఎస్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్‌పై సీసీబీ న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. రాగిణి బెయిల్‌ అర్జీపై 12 పేజీల అభ్యంతరాలలో ఎన్నో అంశాలను కోర్టుకు వివరించారు. నిందితులు బలమైనవారు విచారణకు ఆటంకాలు ఎదురవుతాయి, కాబట్టి బెయిల్‌ ఇవ్వరాదు, రాగిణి ఐదేళ్ల నుంచి బెంగళూరుతో పాటు వివిధ నగరాలలో జరిగిన డ్రగ్స్‌ పాలలో పాల్గొన్నారు. ఆంధ్ర, గోవా, ముంబైతో పాటు విదేశాల నుంచి డ్రగ్స్‌ను కోనుగోలు చేశారు. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసినప్పుడు సాక్ష్యాలను నాశనం చేశారు అని అందులో ఆరోపించారు.   

హోటళ్లు, రిసార్టులకు నోటీసులు 
శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పార్టీలు నిర్వహించిన హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అనేక ప్రతిష్టాత్మక హోటల్స్‌లో అర్ధరాత్రి వరకు నటి రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ముఖ్య నిందితుడు వీరేన్‌ ఖన్నాలు నిర్వహించినట్లు సీసీబీ గుర్తించారు. ఆ విందు వినోదాల సీసీ కెమెరాల చిత్రాలను తమకు అందజేయాలని హోటళ్లను పబ్‌లను కోరారు. సీసీబీ అరెస్ట్‌ చేసిన పలువురు నిందితులు ఏయే హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లలో మజా చేసిందీ వెల్లడించారు.   (డ్రగ్స్‌ కేసు: సీసీబీ ఎదుట గ్లామర్‌జంట)

కింగ్‌పిన్‌ శివప్రసాద్‌ ఎక్కడ   
డ్రగ్స్‌ బాగోతంలో ప్రధాన నిందితుడు, ఎ1గా ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న శివప్రసాద్‌ కోసం సీసీబీ గాలిస్తోంది. ఇతని గురించి ఆసక్తికరమైన విషయాలను సీసీబీ సేకరించింది. రాగిణికి చాలా సన్నిహితుడు. అతడు దొరికితే కేసు మిస్టరీ అంతా వీడిపోతుందని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు.  

విచారణ బాగా లేదు: లంకేశ్‌   
కాగా, డ్రగ్స్‌ కేసు విచారణ తూతూ మంత్రంగా జరుగుతోందని దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ అన్నారు.  ఈ బాగోతంలో నటీమణులేకాదు. నటులు, రాజకీయనాయకుల పుత్రులు ఉన్నారు. కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్‌ చేశారు.  

శ్రీనివాస సుబ్రమణ్యన్‌ విచారణ  
బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తున్న శ్రీనివాస సుబ్రమణ్యన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్, వైభవ్‌ జైన్‌లతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలను అందజేశాడు. ఇక ఒక నటి అన్నా తమ్ముళ్లు, సంగీత దర్శకులను సీసీబీ విచారణకు పిలవనుంది. 

మరిన్ని వార్తలు