నటీమణులకు నిరాశ

20 Sep, 2020 06:54 IST|Sakshi

రాగిణి, సంజనల బెయిలు అర్జీ 21కి వాయిదా

బెయిలు ఇవ్వరాదని సీసీబీ వకీలు వాదనలు  

యశవంతపుర: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్‌ పిటిషన్‌ను సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలోని 33వ ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు శనివారం విచారించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాల నమోదుకు రెండురోజులు గడువు కోరడంతో జడ్జి విచారణను 21వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నటీమణులకు నిరాశ ఎదురైంది. డ్రగ్స్‌ విక్రేతలతో నటులకు లింక్‌ ఉందని, బెయిలును మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీసీబీ తరఫు న్యాయవాది వాదించారు. రాగిణి, సంజనల సన్నిహితులు రవిశంకర్, రాహుల్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్‌ పిటిషన్లు కూడా సోమవారం కోర్టు ముందుకు వస్తాయి.   

సీసీబీ విచారణకు ఆ ముగ్గురు  
డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్, నటుడు అకుల్‌ బాలాజీ, నటుడు సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దేవరాజ్‌ కొడుకు యువరాజ్‌లు శనివారం సీసీబీ విచారణకు హాజరయ్యారు. వీరు సీసీబీ ఆఫీసులోకి వస్తుండగానే మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు డ్రగ్స్‌ పార్టీలలో పాల్గొని మత్తు పదార్థాలను సేవిస్తున్నారా, పార్టీల నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్‌ను ఎవరు సప్లై చేసేవారు తదితర కోణాల్లో ప్రశ్నించారు. ఎన్ని ఏళ్లు నుంచి డ్రగ్స్‌ పారీ్టలకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ పారీ్టలను ఏర్పాటు చేసేవారో ఆరా తీశారు. యాంకర్‌ అకుల్‌ బాలాజీకి ముఖ్య నిందితుడు వీరేన్‌ ఖన్నా ఎన్నేళ్ల నుంచి పరిచయం. మీ ఫాం హౌస్‌ను ఎన్నికాలం వరకు లీజుకు ఇచ్చారు అని అకుల్‌ను ప్రశ్నించారు. 

ప్రముఖులతో జాబితా
డ్రగ్స్‌ కేసులో పెద్ద పెద్ద అధికారుల పుత్రులు, స్టార్‌ నటులు, ప్రైవేట్‌ టీవీ చానల్స్‌కు చెందిన యాంకర్ల పేరు బయటకు వస్తున్నాయి. వీరేన్‌ఖన్నా తనకు పరిచయమైన వారందరి పేర్లను సీసీబీకి వివరించినట్లు తెలిసింది. విలాసంతమైన హోటల్స్, పబ్, అపార్ట్‌మెంట్లలో జరిగే విందు వినోదాల్లో పోలీసు అధికారు, యాంకర్లు, రాజకీయ నాయకుల తనయులు పాల్గొనేవారి జాబితాను సీసీబీ సిద్ధం చేసింది. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు.   

మరిన్ని వార్తలు