బాత్‌రూమ్‌లో కిందపడ్డా.. ఆస్పత్రికి తీసుకెళ్లండి

13 Oct, 2020 08:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : డ్రగ్స్‌ కేసులో పరప్పన జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది బాత్‌ రూమ్‌లో కిందపడి గాయపడినట్లు తెల్సింది.  ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని సోమవారం ఆమె తరఫున న్యాయ వాది ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖ లు చేశారు. జారిపడటంతో వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని, జైలు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను న్యాయమూర్తి శీనప్ప ఆదేశించారు. ఇటీవల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించడంతో రాగిణి, సంజనలు పరప్పన  జైల్లో ఉంటున్నారు.

నటి ప్రణీత పేరుతో వంచన 
బహుభాషా నటి ప్రణీత పేరుతో వంచకులు ఎస్‌వీ.గ్రూప్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ కంపెనీని మోసం చేసిన ఘటనపై ఇక్కడి హైగ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. వివరాలు.. బెంగళూరు ప్రైవేటు హోటల్‌కు ఎస్‌వీ.గ్రూప్‌ మేనేజర్‌ను పిలిపించుకున్న వంచకులు తాము నటి ప్రణీత మేనేజర్లమని పరిచయం చేసుకున్నారు. అంతేగాక సదరు నటిని సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చేస్తామని డీల్‌ కుదుర్చుకున్నారు. రూ.13.5 లక్షలు చెల్లిస్తే ప్రణీత మరో గంటలో వచ్చి ఒప్పందంపై సంతకం చేస్తారన్నారు. వీరి మాటలు నమ్మిన సదరు సంస్థ ఉద్యోగి వారికి నగదు ఇచ్చేశాడు. క్షణాల్లోనే వంచకులు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు మహమ్మద్‌ జునాయత్, వర్షాపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు