నువ్వు ఐరన్‌ ఉమెన్‌వి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంకా ఇంకా పోరాడుతునే ఉంటావు

28 Dec, 2022 07:05 IST|Sakshi

సినిమాల్లో నటిస్తున్నా, లేకపోయినా కొందరి క్రేజ్‌ ప్రజల్లో ఏ మాత్రం తగ్గదు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. నటిగా పరిచయం కాకముందు పాకెట్‌ మనీ కోసం పెళ్లి రిసెప్షన్లు, ఫంక్షన్లు తదితర సేవలు అందించారు. కథానాయకిగా పరిచయం అయిన తరువాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులో గౌతమ్‌ దర్శకత్వం వహించిన ఏ మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.

ఆ వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌తో బృందావనం చిత్రంలో నటించే అవకాశం వరించడం.. అది ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్‌ అంతస్తుకు చేరుకున్నారు. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ది ప్యామిలీమ్యాన్‌–2 వెబ్‌ సిరీస్‌ జాతీయస్థాయిలో ఈమెకు క్రేజ్‌ తీసుకొచ్చింది. అలాంటి సమంత అనూహ్యంగా మయోసిటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురవడం అందరికి షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధితో గట్టిగా ఫైట్‌ చేస్తున్నారు. దీంతో సమంతకు పలువురు ధైర్యం చెబుతున్నారు. కాగా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ సమంతకు మంచి స్నేహితుడు.

చదవండి: (Pooja Hegde: చిన్ననాటి కల నెరవేరింది)

ఈయన సమంత గురించి తన ట్విట్టర్‌లో ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పోరాడుతునే ఉంటావు ఇంకా ఇంకా పోరాడుతునే ఉంటావు.. ఎందుకంటే నువ్వు ఐరన్‌ ఉమెన్‌వి. నిన్ను ఏది ఓడించలేదు. కష్టాలు బాధించకుండా నిన్ను ఇంకా శక్తివంతంగా మారుస్తాయని’’ పేర్కొన్నారు. అందుకు సమంత బదులిస్తూ ధన్యవాదాలు రాహుల్‌. నాలాగే బయట ఎవరైనా పోరాడుతుంటే వారికి నేను ఇదే చెబుతాను.

పోరాడుతునే ఉండండి మీరు ఇంకా బలంగా తయారవుతారు. ధృఢంగా కష్టాలను ఎదుర్కోండి అని పేర్కొన్నారు. కాగా సమంత త్వరగా కోలుకోవాలని ఆమెతో పాటు ఖుషి చిత్ర యూనిట్‌ కూడా బలంగా కోరుకుంటోంది. ఆమె విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాగా సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం చిత్రం 2023లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.    

మరిన్ని వార్తలు