తొలి పరిచయం!

27 Nov, 2020 06:29 IST|Sakshi

జయప్రద తొలి పరిచయానికి శ్రీకారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ., మలయాళం, హిందీ, భోజ్‌ పురి.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన జయప్రద ఇప్పుడు తొలి పరిచయం ఏంటీ? అనుకోవచ్చు. ఆమె పంజాబీ తెరకు పరిచయం కానున్నారు. జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అమితాబ్‌ బచ్చన్, జయప్రద కాంబినేషన్‌లో ‘ఆజ్‌ కా అర్జున్‌’ (1990), రజనీకాంత్, ప్రేమ్‌ చోప్రా, రేఖ కాంబినేషన్‌ లో ‘ఫూల్‌ బనే అంగారే’ ఇంకా ధర్మేంద్ర, వినోద్‌ ఖన్నా, అజయ్‌ దేవగన్‌ వంటి హీరోలతోనూ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగానూ బొకాడియాకి పేరుంది. తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ వోతీ దా వ్యాహ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్‌ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా ‘భూత్‌.. అంకుల్‌–తుసీ గ్రేట్‌ హో’ని ఆరంభించారు బొకాడియా. జయప్రదకు పంజాబీలో ఇది తొలి సినిమా కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రాజ్‌ బబ్బర్‌ చేస్తున్న పంజాబీ సినిమా ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు