రెండేళ్లు తిరిగా.. ఎవరూ ముందుకు రాలేదు: హీరో

1 Apr, 2023 21:13 IST|Sakshi

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే! తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ తీసిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి  నటీనటులుగా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్  ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ రాజ్ కహాని సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు' అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశాడు. కరీంనగర్ లోని తిరుమల  థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్‌గా రన్ అవ్వడం చాలా మంచి విషయం. ఇలాగే వీరు ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. 

చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను నా చిన్నప్పుడు సినిమా చూడడానికే  ఎంతో ఇబ్బంది పడేవాన్ని. గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథ వినిపించా. ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చివరకు నేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా స్టార్ట్ చేశాము. కానీ కొంత కాలానికి కరోనా రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించాం. మా సినిమాను పెద్దలకు ప్రివ్యూ వేయడంతో సినిమా చాలా బాగుందని అనడంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాను విడుదల చేసే స్థోమత  లేకున్నా ఓన్ గా సినిమా రిలీజ్ చేశాము' అన్నారు.

మరిన్ని వార్తలు